burglary case
-
పోలీసు ఇంటికే కన్నం
మీర్‌పేట: ఓ పోలీసు ఇంటికి కన్నం వేసిన దొంగలు 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.17లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ, విజయపురికాలనీకి చెందిన ముడావత్ శంకర్ ఛత్రినాక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మి ఈ నెల 27న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. గురువారం ఉదయం శంకర్ ఉదయం డ్యూటీకి వెళ్లాడు. అతడి కుమార్తె, కుమారుడు కాలేజీకి వెళ్లారు. మధ్యాహ్నం శంకర్ తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాల్లోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కుమార్తె వివాహం కోసం దాచిన 35తులాల బంగారు ఆభరణాలు, రూ.17 లక్షల నగదు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన శంకర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు. చోరీపై అనుమానాలు...? ఆభరణాలు, నగలు ఉంచిన బీరువాలకు తాళాలు వేసి ఉండకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనై ఉంటుందని, పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌పేట ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: పోలీస్ కొలువుకు మూడు టెక్నిక్‌లు.. పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్) -
దొరకనే దొరక్కూడదు! నంబర్ ప్లేట్ మార్చి చివరికి...
సాక్షి హైదరాబాద్: ‘‘ఇటీవల హస్తినాపురంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులు వాడిన కారు దొంగిలించిందే. సేమ్ మోడల్, రంగు ఉన్న కారు నంబర్‌ను ఆన్లైన్లో వెతికి, నకిలీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను తయారు చేశారు. ఆపై దీన్ని కొట్టేసిన కారుకు తగిలించి..ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీలోని ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ సేకరించిన పోలీసులు.. ఆ అడ్రస్‌కు వెళితే అక్కడున్నది నిందితులు కాకపోవటంతో పోలీసులు ఖంగుతిన్నారు.’’ .. ఇలా దొంగలు రూటు మార్చారు. రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడే నిందితులు ఆప్డేట్ అయ్యా రు. విచారణలో పోలీసుల దృష్టి మళ్లించేలా కొత్త ప్ర ణాళికలు అమలు చేస్తున్నారు. దొరకొద్దు, దొరికినా ఆలస్యంగా దొరకాలి. ఈ లోపు చోరీ చేసిన సొత్తును తరలించాలి. మొత్తానికి రికవరీ లేకుండా చూసుకుంటామని విచారణలో నిందితులు తెలుపుతుండటంతో పోలీసులు షాక్ తింటున్నారు. నకిలీ హెచ్ఎస్ఆర్పీ తయారీ.. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు ముందుగా రాజమండ్రిలోలో ఓ కారును దొంగిలించారు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ వాహనాల ఏజెంట్లు, బ్రోకర్ల వాట్సాప్ గ్రూప్‌లలో నిందితులు చేరారు. సేమ్ కలర్, మోడల్ కారు కనిపించగానే.. దాని నంబర్‌తో నకిలీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)ని తయారు చేయించి.. దాన్ని దొంగిలించిన కారుకు తగిలించారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలు ఉపయోగించిన కారును గుర్తించిన పోలీస్‌లు నంబర్ ప్లేట్ ఆధారంగా రాజమండ్రికి వెళ్లిపోయారు. తీరా అక్కడికెళ్లాక కారు, దాని యజమాని అక్కడే ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. కారు బంపర్ ఎలా ఉంది? నంబర్ ప్లేట్ మార్చేసి నిందితులు కన్ఫ్యూజ్ చేశారని తెలుసుకున్న పోలీస్‌లు.. నంబర్ ప్లేట్ కాకుండా కారుకు ఇంకా ఏం గుర్తులున్నాయని పరిశీలించారు. బంపర్ ఎలా ఉంది? వీల్ క్యాప్స్ ఎలా ఉన్నాయి? ఫాగ్ లైట్లు ఎలా ఉన్నా యి? డెంట్లు ఉన్నాయా? వంటి ఇలా 360 డిగ్రీల కోణంలో కార్‌ను పరిశీలించి.. చోరీ కేసులో నిందితులు వినియో గించింది ఈ కార్ కాదని నిర్ధారణకు వచ్చారు. ఆపైన కారు అసలు యజమాని ఫోన్ నంబర్‌ను డేటా ఆధారంగా నిందితుడు ఇతగాడు కాదని తెలుసుకున్నారు. ఆపై అసలు నిందితుల కోసం వేట మొదలుపెట్టి.. చివరికి పట్టుకున్నారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. విచారణ సమయంలో పోలీస్‌లను కన్ఫ్యూజ్ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. చోరీకి వచ్చేటప్పుడు ఎల్బీనగర్ పరిసరాల్లోని 20 గల్లీల్లో తిప్పి ఓఆర్ఆర్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ గల్లీలు తిరుగుతూ దేవాలయానికి చేరుకొని చోరీకి పాల్పడ్డారు. అనంతరం నేరుగా ఏపీకి వెళ్లకుండా సాగర్ హైవేలపై గంటల కొద్ది తిరిగారు. 4–5 గంటల తర్వాత నేరస్తులు విజయవాడ రోడ్ మీదుగా పరారయ్యారు. -
దోపిడీకి పాల్పడిన ముఠా అరెస్ట్
పరకాల : విలాసాలకు అలవాటుపడి దారిదోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉండగా వారి నుంచి రూ.13 వేల నగదు, సెల్‌ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పరకాల ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర వెల్లడించారు. బుధవారం సాయంత్రం పరకాల పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నిందితుల వివరాలు ఆయన వెల్లడించారు. హసన్‌పర్తి మండలం మడిపల్లె గ్రామానికి చెందిన అరికెల శ్రీవర్ధన్, కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శివాజీతోపాటు మరో ముగ్గురు మైనర్లు ముఠాగా ఏర్పడ్డారు. రు జూలై 30న తెల్లవారుజామున 2 గంటలకు భూపాలపల్లి నుంచి ధర్మారం మీదుగా హన్మకొండ వైపు వెళ్తున్న ఇసుక లారీని ఆపి డ్రైవర్ గాజుల అనిల్‌పై దాడి చేసి రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లి, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. డ్రైవర్ ఫిర్యాదు అందగానే సీఐ శివరామయ్య ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్‌తో పోలీసు బృందాలు గాలించాయి. సీసీ కెమెరాల్లో లభ్యమైన ఆటో ఆధారంగా దోపిడీకి ముఠాను బుధవారం మధ్యాహ్నం నడికుడ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిపై 395 సెక్షన్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రెండు రోజుల్లో నిందితులను పట్టుకున్నందుకు సీఐ శివరామయ్య, ఎస్సైలను ఆయన అభినందించారు. ఈ కేసులో సీసీ కెమెరాల పుటేజీలు ఎంత దోహదపడ్డాయన్నారు. సమావేశంలో సీఐ శివరామయ్య, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్ పాల్గొన్నారు. -
రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు!
ఉత్తరప్రదేశ్ పోలీసులకు చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది. కేవలం ఎఫ్ఐఆర్లో పేరుందన్న కారణంగా రెండేళ్ల అబ్బాయిపై దోపిడీ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అసలు ఫిర్యాదులో ఏముందో చూసుకోకుండా, ఆ పిల్లాడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి కూడా వెళ్లారు. ఆ పిల్లాడి తండ్రి వెళ్లి, ఇదేంటని మొరపెట్టుకున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ నుంచి పిల్లాడి పేరు తీసేస్తామని చెబుతున్నారు. విషయం ఏమిటంటే.. యూపీలోని బజేరా గ్రామానికి చెందిన అమిత్ కుమార్, అతడి ఇంటి ఇరుగుపొరుగువాళ్లు కలిసి కొందరు ఓ దోపిడీ దొంగను పట్టుకున్నారు. అతడు తనపేరు భరత్ అని, తనకు మరో వ్యక్తి సహకరించాడని చెప్పాడు. పోలీసులు ఆ రెండో వ్యక్తి పేరు కూడా ఎఫ్ఐఆర్లో రాసేశారు. తీరా అరెస్టు చయడానికి ఇంటికి వెళ్తే, అతడు రెండేళ్ల పిల్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు ఆ మాట నమ్మలేదు. ఆ కుటుంబాన్ని వేధించారు. తర్వాతి రోజు ఆ తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. మీడియాకు విషయం తెలిసి అది కాస్తా భగ్గుమన్న తర్వాత.. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్లు అతడి పేరును ఎఫ్ఐఆర్ నుంచి తీసేస్తామన్నారు.