నోట్ల కోసం పడిగాపులు
► ఇంకా తెరుచుకోని ఏటీఎంలు
► సామాన్యులకు తప్పని అవస్థలు
పళ్లిపట్టు: కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో జనాలు ఒక్కసారిగా బ్యాంకులకు చేరుకుని తమ వద్ద ఉన్న నగదును (రూ.500,రూ.1000 నోట్లు)బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో రోజూ ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించి తమఖాతాలో పెద్ద నోట్లను జమచేశారు. ఇదిలా ఉండగా శనివారం సైతం ఏటీఎం సేవలు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పలేదు. నిత్యావసర వస్తువుల కోనుగోలుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట ప్రాంతాల్లోని బ్యాంకుల్లో శనివారం సైతం ఖాతాదారుల రద్దీ ఎక్కువగా కనిపించింది. కిక్కిరిసిన జనాలను అదుపు చేసేందుకు బ్యాంకు అధికారులు పోలీసుల సహాయం కోరారు.
పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసి పాత నోట్ల డిపాజిట్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఖాతాదారులు దాదాపు మూడు గంటలు వేచి ఉండి తమ వద్ద ఉన్న పాత నోట్లను ఖాతాలో జమచేయడంతో పాటు రూ.4వేలు(కొత్త నోట్లు /రూ.100 నోట్లు) పొందారు. ఏటీఎంలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మళ్లీ మూతపడడంతో సామాన్యులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. పొదటూరుపేటలోని ఇండియన్ బ్యాంకు వద్ద వందలాది మంది మహిళలు డిపాజిట్ చేసేందుకు రావడంతో పోలీసులు ప్రత్యేక క్యూ పద్ధతి పాటించి బ్యాంకులోకి అనుమతించారు. బ్యాంకు సిబ్బంది పాత నోట్లు డిపాజిట్ చేసుకోవడంతో సరిపెడుతున్నారని కొత్త నోట్లు లేవని చేతులెత్తేస్తున్నట్లు వాపోయారు. తిరుత్తణిలోని అన్ని బ్యాంకుల్లో శనివారం ఖాతాదారుల సంఖ్య భారీగా కనిపించింది. పూర్తి స్థారుులో ఏటీఎంలు పనిచేయకపోవడంతో పాటు రూ.100, 500 అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారింది.