కేన్సర్ లక్షణాలను గుర్తించే స్మార్ట్ఫోన్!
కేన్సర్ లక్షణాలను స్మార్ట్ఫోన్లు గుర్తిస్తాయంటే మీరు నమ్మగలరా? ఇప్పటికైతే కష్టమేమో గానీ.. రాబోయే రెండేళ్లలో ఇది సాధ్యం కాబోతోంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. స్మార్ట్ఫోన్కు అనుసంధానం చేసే ఒక చిన్న పరికరం ఈ మొత్తం పని పూర్తి చేస్తుంది. శాస్త్రవేత్తలు 'డిసీజ్ బ్రీతలైజర్' అనే చిన్న డెస్క్టాప్ పరికరం ఒకదాన్ని రూపొందించారు. అది బాగా పనిచేస్తున్నట్లు కూడా నిర్ధరించుకున్నారు. ఇక రెండేళ్ల వ్యవధిలో తాము దీన్ని మొబైల్ ఫోన్కు అనుసంధానం చేసేంత చిన్న పరిమాణంలోకి మార్చేస్తామని, కేవలం దానికి పెట్టుబడులు సాధించడమే ఇప్పుడు మిగిలిందని ఈ పరిశోధనలో పాల్గొన్న బిల్లీ బోయల్ తెలిపారు.
ఈ పరికరంలో ఒక వేలి గోరంత పరిమాణంలో ఉండే మైక్రోచిప్ ఒకటి ఉంటుంది. దానికి రసాయనాలను గుర్తుపట్టేలా ప్రోగ్రామింగ్ చేయచ్చు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న రసాయనాలను కూడా ఇది ఇట్టే పసిగడుతుంది. దానివల్ల కేన్సర్ లాంటి వ్యాధుల లక్షణాలు ప్రాథమిక దశలోనే తెలిసిపోతాయి. రెండేళ్ల తర్వాత వచ్చే ఈ పరికరం కేన్సర్ చికిత్సలో ఓ పెద్ద విప్లవం కానుంది. ఇప్పటివరకు వ్యాధి బాగా ముదిరితే తప్ప కేన్సర్ లక్షణాలు బయటపడేవి కావు. దానివల్ల చికిత్స కూడా కష్టమయ్యేది, దానికి వ్యయం ఎక్కువ అవుతోంది, వ్యాధి కూడా ఒక పట్టాన లొంగట్లేదు. అదే ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే.. చికిత్స మరింత సులభతరం అవ్వడమే కాకుండా, రోగి త్వరగా కోలుకోడానికి కూడా అవకాశం ఉంటుంది.