వ్యాపార నియంత్రణ కోసమే!
పశువధ నిషేధంపై నోటిఫికేషన్ తీసుకొచ్చామన్న కేంద్రం
► నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం
► 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పశువుల వ్యాపారంలో నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పశువుల అమ్మకంపై నిషేధం విధించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఉద్దేశంతోనే కేంద్రం పశువధను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) పీఎస్ నరసింహారావు సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా పశువుల మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే ప్రభుత్వం ఆలోచన అని.. సక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన తెలిపారు. పశువధపై కేంద్ర నిర్ణయాన్ని (మే 26న జారీ అయిన నోటిఫికేషన్) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం దీనిపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది. జూలై 11కు కేసును వాయిదా వేసింది.
రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్లు
కేంద్రం నిర్ణయంపై స్టే విధించాలన్న ఓ పిటిషనర్ ప్రశ్నపై ఏఎస్జీ స్పందిస్తూ.. ఇప్పటికే మద్రాసు హైకోర్టు స్టే విధించినందున కేంద్రం నిర్ణయం ప్రస్తుతానికి అమల్లో లేదన్నారు. పిటిషనర్ల తరపున వాదిస్తున్న కొందరు న్యాయవాదులు.. పశువధపై నిషేధం వల్ల కేరళ, తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర నోటిఫికేషన్తో విశ్వాసం, మత స్వాతంత్య్రానికి భంగం వాటిల్లుతోందన్నారు. హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ ఖురేషీ అనే పిటిషనర్ ‘నోటిఫికేషన్ జంతువులను బలి ఇచ్చే మత విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంద’ని పేర్కొన్నారు. దీంతోపాటుగా రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆహారపు హక్కు నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉందన్నారు.
ఇలాగైతే జీవితాలు దుర్భరం!
కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని తమ రాష్ట్రాల్లో అమలుచేయబోవటం లేదని స్పష్టం చేసిన విషయాన్ని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో పశువధపై ఆధారపడి బతుకుతున్నవారి జీవితాలు దుర్భరమవుతాయని ఆయా రాష్ట్రాలు చెప్పటాన్నీ వారు గుర్తుచేశారు. పశువుల అమ్మకం, కొనుగోలుపై నిషేధం వల్ల రైతులపైనా పెనుభారం పడుతుందని.. ఈ వ్యాపారంపై ఆధారపడేవారి కుటుంబాల్లో పిల్లలు మూడుపూటలా తినే పరిస్థితి లేదన్నారు.