గ్రావెల్ స్వాహా
మేదరమెట్ల, న్యూస్‌లైన్: గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామమైన తమ్మవరంలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు లక్షలకు లక్షలు దండుకుంటున్నారు. తమ్మవరంలో గ్రావెల్ అధికంగా లభిస్తుండటంతో కొందరి కన్ను ఆ గ్రామంపై పడింది. పగలు, రాత్రీ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పది అడుగుల లోతుకుపైగా గుంతలు తీసి గ్రావెల్ తవ్వి మాయం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో గ్రావెల్ తరలిపోతున్నా రెవెన్యూ, మైనింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ముంపు గ్రామాలను త్వరగా ఖాళీ చేస్తే ఆ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పి గ్రామస్తులను ఖాళీ చేయించారు.
కానీ నేటికీ అటవీ శాఖకు సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రావెల్ అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామం మొత్తం భారీగా గోతులు పెట్టి గ్రావెల్ తరలించుకుపోతున్నారు. గుండ్లకమ్మ నదికి ఆనుకొని రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. పథకాల సమీపంలో 15 అడుగుల లోతులో గోతులు తీయడం వల్ల భారీ వర్షాలకు గోతులు నీటితో నిండిపోయి..పథకాలు సైతం నీటమునిగే పరిస్థితి ఏర్పడనుంది. ట్రాక్టర్ గ్రావెల్‌ను రూ 800 నుంచి వెయ్యి రూపాయల వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలోని గ్రోత్ సెంటరుకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరుకు రూ 3 వేల వరకు వసూలు చేయడం గమనార్హం. దీంతో చివరకు ఆ గ్రామంలో గుంతలు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.