విజయోత్సవ ర్యాలీలు నిషేధం
చేవెళ్ల, న్యూస్‌లైన్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిషేధమని చేవెళ్ల డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 20 వరకు ఎన్నికల కమిషన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చేవారు ఎవరైనా సరే పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం 7 గంటలలోపే కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ట్రాఫిక్ మళ్లింపు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేవెళ్ల సెగ్మెంట్ లోక్‌సభ, అసెంబ్లీ కౌంటింగ్ నిర్వహిస్తున్నందున ఈ దారిలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శంకర్పల్లి నుంచి చేవెళ్లకు వచ్చే రహదారిలో ఎనికెపల్లి చౌరస్తా నుంచి ఊరెళ్లమీదుగా చేవెళ్లకు రావడానికి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల నుంచి శంకర్పల్లి వెళ్లే వాహనాలను మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం పక్కనుంచి ఊరెళ్ల రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందన్నారు.
ఈ విషయాన్ని వాహన యజమానులు గమనించి సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం 144వ సెక్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయన్నారు.