తల్లిని హింసిస్తే గుప్త నిధులు!
అనంతపురం: తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని జ్యోతిష్యుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మారు రామాంజనమ్మ కుటుంబ సభ్యులు. దీంతో రామాంజనమ్మను చిత్ర హింసలకు గురి చేశారు. దాంతో ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రామాంజనమ్మపై పరిస్థితిని చూసి ఆస్పత్రి వైద్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో భార్యభర్తలు రామాంజనమ్మ, చెండ్రారాయుడు నివసిస్తున్నారు. వారికి శాంతి అనే కుమార్తె ఉంది. అయితే ఇటీవల చెండ్రారాయుడు, ఆమె కుమార్తె శాంతి జ్యోతిష్యుడ్ని సంప్రదించగా... తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో తండ్రీకూతురు ఇంటికి చేరుకుని రామాంజనమ్మను చిత్ర హింసలకు గురి చేశారు.
దాంతో ఆమె పరిస్థితి విషమించింది. స్థానికులు ఆ విషయాన్ని గమనించి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తండ్రికూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.