China Mobile Handsets
-
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్‌లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్‌లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్‌కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్‌గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్‌లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
మార్కెట్లోకి ‘రెడ్మి నోట్ 8’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి నోట్ 8, 8 ప్రో’ పేరిట రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదలచేసింది. ఇన్ బిల్ట్ అమెజాన్ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్లు.. గూగుల్ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్ ఇవే కాగా, వీటిలో రెడ్మి నోట్ 8 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6.39 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ మోడల్లో 6జీబీ/64జీబీ ధర రూ. 9,999.. 6జీబీ/128జీబీ ధర రూ.12,999గా నిర్ణయించింది. మరో మోడల్ 8 ప్రో మూడు వేరియంట్లలో విడుదలైంది. 6.53 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ మోడల్ ధరల శ్రేణి రూ. 14,999 నుంచి రూ. 17,999గా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్సెట్తో విడుదలైన అధునాతన స్మార్ట్ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ అన్నారు. అక్టోబరు 21 నుంచి కొత్త మోడళ్లు వినియోగదారులకు లభ్యంకానున్నాయని వెల్లడించారు. -
దేశీ మొబైల్ కంపెనీలకు విదేశీ బ్రాండ్స్ షాక్
చైనా కంపెనీలకు దేశీ హ్యాండ్సెట్ మార్కెట్లో 49% వాటా న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు దేశీ బ్రాండ్స్‌కు గట్టి పోటీనివ్వడమే కాదు.. ఏకంగా వాటిని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయి. చైనా బ్రాండ్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (2017, జనవరి–మార్చి) ఇండియన్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే వీటి ఆదాయంలో 180 శాతం వృద్ధి నమోదయ్యింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ‘ఇండియా క్వార్టర్లీ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రివ్యూ’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశంలో మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రూ.3,46,295 మిలియన్ల రాబడిని అర్జించింది. త్రైమాసికం పరంగా చేస్తే ఇందులో 8 శాతం క్షీణత నమోదయ్యింది. విక్రయాల పరంగా చూస్తే శాంసంగ్, ఐటెల్, షావోమి కంపెనీల మార్కెట్ వాటా వరుసగా 27 శాతం, 9 శాతం, 6 శాతంగా ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో చైనా కంపెనీలు ఇప్పటికే దేశీ బ్రాండ్స్‌కు టాప్–5లో చోటులేకుండా చేశాయి. రానున్న రోజుల్లో మన బ్రాండ్స్‌కు మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఇక యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ మోడల్ని దేశీయంగా ఉత్పత్తి చేస్తుండటంతో వివో, ఒప్పొ బ్రాండ్స్‌కి రూ.15,000–రూ.25,000 విభాగంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది.