శివప్రసాద్‌పై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు
- ఎంపీ వ్యక్తిగత విషయాలపై ఎమ్మెల్సీ బుద్ధా విమర్శలు
విజయవాడ: చంద్రబాబు పాలనలో దళితులకు న్యాయం జరగడంలేదంటూ నిరసన గళం విప్పిన చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ పై సొంతపార్టీ నేతల విమర్శలదాడి ఆగలేదు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రులు జవహర్, అమర్నాథ్రెడ్డిలు శివప్రసాద్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకువేసి శివప్రసాద్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేశారు.
ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన బుద్ధా.. ‘శివప్రసాద్ దళితుల కొసం పొరాడేవాడైతే, దళితులను ఎందుకు పెళ్లి చేసుకొలేదు?’ అని ప్రశ్నించారు. శివప్రసాద్ భూకబ్జా ఫైల్ పై సంతకం పెట్టక పోవడం వల్లే చంద్రబాబును దళిత ద్రోహి అని విమర్శిస్తున్నాడని ఆరోపించారు. శివప్రసాద్ కి రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనని, కుప్పంలో వచ్చిన మెజార్టీ వల్లే చిత్తూరు ఎంపీగా శివ ప్రసాద్ గెలిచిన సంగతి గుర్తుచేసుకోవాలన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే చితూరు ఎంపీ నియోజకవర్గంలొ శివప్రసాద్ సర్పంచ్ గా కుడా గెలవలేరని బుద్ధా అన్నారు.
‘శివప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు దళితుల ఇండ్లలో ఏనాడైనా భోజనం చేశారా? దళితులపై ఆయనకు ప్రేమ ఉంటే ఆ వర్గానికి చెందినవారిని ఎందుకు పెళ్లిచేసుకోలేదు? అవసరం కోసం దళితులను వాడుకోవడం శివప్రసాద్ నైజం. మరోసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తిరుపతి వచ్చి భాగోతం బయటపెడతా’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
(చదవండి: చంద్రబాబుపై శివప్రసాద్ ధ్వజం)
(నేనేం తప్పు మాట్లాడాను?)