అందరూ చూస్తుండగానే సోషల్ మీడియా స్టార్ కన్నుమూత : దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అన్నాడో సినీ కవి. నిజమే కదా..ఏ విషాదం ఎలా ముంచుకొస్తుందో, ఎవరి మరణం ఎలా దూసుకొస్తుందో తెలియదు. ఆహార నియమాలుపాటిస్తూ, నిరంతరం వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్‌గా ఉన్నాం అనుకునేవారు కూడా గుండెపోటుతో విలవిల్లాడుతూ కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోషల్ మీడియా స్టార్ అకాల మరణం ఇలాంటి నిర్వేదాన్ని మిగులుస్తోంది. అప్పటివరకూ ఎంతో సంతోషంగా, ఆడుతూపాడుతూ ఉన్న ఆమెను మృత్యువు కబళించిన తీరు పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.27 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ అకోస్టా అనూహ్య మరణి ఆమె ఫ్యాన్స్‌ను విషాదంలోకి నెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్న కరోల్, న్యూయార్క్‌లో(NewYork) తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. భోజనం చేస్తున్న సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరైంది. కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ప్రాణాలొదిలేసింది. కరోల్ ఆన్లైన్లో ‘కిల్లడమెంటే’(‘Killadamente’) అనే పేరుతో కూడా సుపరిచితురాలు. ఫ్యాషన్, జీవనశైలి, మాతృత్వంపై వీడియోలను షేర్ చేస్తే ఆదరణ పొందింది. బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తూ, తన వ్యక్తిగత విషయాలు, తాను నెట్టుకొచ్చినతీరు ముఖ్యంగా ఆందోళన, నిరాశతో తన స్ట్రగుల్ గురించి నిస్సంకోచంగా తెలియజేస్తూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కరోల్ మరణవార్తను ఆమె సోదరి కట్యాన్(Katyan) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియ జేసింది.“నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరీ.ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. ఇంత మంచి మనసున్న సోదరిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నీకు మనశ్సాంతి సోదరీ” అంటూ భావోద్వేగంతో ఒక సందేశం పోస్ట్ చేసింది. ఈ విషాదంలో తమకు సానుభూతి తెలిపిన అకోస్టా అభిమానులకు కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ పోస్ట్ ఇపుడు కనిపించడం లేదు. మరో పోస్ట్‌లో కరోల్ తన సోదరి మాత్రమే కాదని, పార్ట్నర్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ కట్యాన్ గుర్తు చేసుకుంది. View this post on Instagram A post shared by Reina (@killadamente) న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం, జనవరి 3న కరోల్ డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది పడిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరోల్ మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉందని సోదరి కట్యాన్ శవపరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, అప్పుడే అసలు విషయం తెలుస్తుందని పేర్కొంది. కరోల్ అకోస్టా మరణంపై ఫాలోవర్లు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది, ఇంత చిన్న వయసులో వెళ్లిపోయావు, వి మిస్ యూ , ఆర్ఐపీ, అన్న సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.