బయోకాన్ బంపర్ బోనస్
ఒక్కో షేర్‌కు రెండు బోనస్ షేర్లు.. రూ. 3 డివిడెండ్
న్యూఢిల్లీ: బయోకాన్ కంపెనీ బంపర్ బోనస్‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు రెండు బోనస్ షేర్లను ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయం తీసుకుందని బయోకాన్ తెలిపింది. అలాగే ఒక్కో షేర్‌కు రూ.3 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ సీఎండీ కిరణ్ మజుందార్ షా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో నికర లాభం 58 శాతం తగ్గిందని పేర్కొన్నారు.
2015–16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.354 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్)2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.148 కోట్లకు తగ్గిందని వివరించారు. అయితే మొత్తం ఆదాయం రూ.973 కోట్ల నుంచి రూ.974 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.609 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 2016–17 ఆర్థిక సంవత్సంరలో రూ.688 కోట్లకు, ఆదాయం 18% వృద్ధితో రూ.3,460 కోట్ల నుంచి రూ.4,079 కోట్లకు పెరిగిందని కిరణ్ తెలిపారు.