‘ఉబర్ సీఈవో కంటతడి.. ఆ మహిళకు సారీ’
న్యూయార్క్: ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జరిగిన అవమానంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెబుతూ కాసేపు ఏడ్చేశారు. తన కంపెనీలో ఇలాంటి సంస్కృతికి అవకాశం ఏర్పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా మొత్తం కంపెనీ కీలక ఉద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులు మీడియా కొలువై ఉన్న బహిరంగ కార్యక్రమంలో. ఉబర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేస్తున్న సుసాన్ పోలర్ అనే మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగాయని, మానవ వనరుల విభాగం నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయని, ఇలా ఏడాదికాలం జరిగినా తనకు ఏమాత్రం అండగా ఉండకుండా వేధింపులకు పాల్పడినా ఆ మేనేజర్‌ను రక్షించుకునే ప్రయత్నం చేసిందని గతవారం తన బ్లాగ్‌లో పేర్కొంది.
మంగళవారం కంపెనీ ఉద్యోగులతో శాన్ఫ్రాన్సిస్కోలో సమావేశం అయిని ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ తన కంపెనీలో తలెత్తిన కల్చరల్ పెయిలింగ్స్కు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. ఫిర్యాదులను లెక్కచేయకుండా హెచ్ఆర్ వ్యవహరించడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే చోట వివక్షకు తావివ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
‘ట్రావిస్ చాలా నిజాయితీగా ఆయన కంపెనీ చేసిన పొరపాట్ల గురించి మాట్లాడారు. 48గంటల్లోగా తన కంపెనీని మరింత ఉన్నతంగా మార్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం ఉబర్‌ను మంచిసంస్థగా తీర్చిదిద్దడమే కాదు.. మొత్తం ఉబర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఇబ్బందులు కలిగించని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమయం వృధా అనే ఆలోచనే రానివ్వకూడదు’ అని ట్రావిస్ చెప్పినట్లు ఆ కంపెనీ హెచ్ఆర్ హఫింగ్టన్ తెలిపారు.