నిరీక్షణ!
కర్నూలు(రాజ్‌విహార్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో పదోన్నతి పొందిన కండక్టర్లకు పోస్టింగ్ ఇవ్వడం మరిచారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. పదోన్నతి కల్పించాక రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఇప్పటికి ఏడాది గడిచినా స్థానాలు చూపలేదు. దీంతో ఇప్పటికీ అదే స్థానాల్లో (పాత పోస్టింగ్స్)నే కొనసాగుతూ పాత జీతమే పొందుతున్నారు.
ఆర్టీసీ కడప జోన్లో పనిచేస్తున్న కండక్టర్లుకు జూనియర్ అసిస్టెంట్స్ (పర్సనల్)గా పదోన్నతి కల్పించేందుకు 2007 సెప్టెంబరులో రాత పరీక్ష నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి 1600 మందికి పైగా ఈ పరీక్షలకు హాజరుకాగా 500 మంది అర్హత సాధించారు. వీరిలో 150 మందికి పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ సిద్ధం చేసి 150 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే 2012లో మిగిలిని 350 మందికి పదోన్నతులు ఇవ్వబోమని, డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకుంటామని అప్పట్లో నోటిఫికేషన్ ఆధారంగా కొంత మందిని తీసుకున్నారు. ఈక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై మిగిలిన వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం మిగిలిన వారికి కూడా ఖాళీల ఆధారంగా విడతల వారీగా పోస్టింగ్ ఇస్తామని కోర్టుకు నివేదించారు. ఇందులో భాగంగా 2013లో ప్యానెల్ రూపొందించి 35 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి నవంబరు 20వ తేదీ నుంచి రెండు నెలల పాటు హైదరాబాదులో శిక్షణ ఇచ్చారు. ఇందులో 18 మంది పర్సనల్ విభాగం, 27 మంది ఫైనాన్స్ విభాగాల వారున్నారు.
జనవరి 20వ తేదీతో శిక్షణ పూర్తయ్యాక కడప జోన్ ఈడీ పోస్టింగ్స్ ఇవ్వాలి. కాని పోస్టింగ్ ఇవ్వకపోవడంతో కార్మికులు కండక్టర్లుగానే కొనసాగుతున్నారు. పదకొండు నెలలుగా పాత జీతంతోనే పని చేస్తూ సర్వీసును కోల్పోయారు. ఇప్పటికైనా ఈడీ స్పందించి పోస్టింగ్‌లు ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఖాజా మిన్నల్ల కోరుతున్నారు.