ధర పెంచకపోతే దిగుమతి తప్పదు...
భారత్‌లో సహజ వాయువు లభ్యతపై ఐహెచ్ఎస్ నివేదిక
న్యూఢిల్లీ: ధరల సంస్కరణలను అమలుచేయకపోతే భారత్‌లో సహజ వాయువు ఉత్పత్తి ప్రస్తుత స్థాయి వద్దే ఆగిపోతుందని అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్ఎస్ పేర్కొంది. ఉత్పత్తి పెరగకపోతే దేశీయ అవసరాలకు గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు:
- మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్‌కు ప్రస్తుతం 4.2 డాలర్లు చెల్లిస్తున్నారు. ఇదే ధరను కొనసాగిస్తే భారత్‌లో గ్యాస్ రోజువారీ ఉత్పత్తి 300 కోట్ల ఘనపు అడుగుల వద్ద నిలిచిపోతుంది. దేశీయ అవసరాల కోసం రోజూ 970 కోట్ల ఘనపు అడుగుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- మునుపటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు గ్యాస్ ధరను 8.5 డాలర్లకు పెంచితే వచ్చే పదేళ్లలో 195 కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ అదనంగా ఉత్పత్తి అవుతుంది.
- ధరల విధానం దేశంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడాలి. ఉత్పత్తి పెరిగితే దిగుమతులు తగ్గి, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది.
- భారత్‌లో ఇప్పటివరకు అనుసరిస్తున్న ధరల విధానాలతో గ్యాస్ డిమాండు, సరఫరాల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ కారణంగానే ప్రపంచంలో ఎల్ఎన్జీని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.