Convention on Biodiversity
-
చూస్తున్నారా.. ఈ ‘చిత్రం’ .. !
సిటీబ్యూరో: నగరంలో రెండేళ్ల క్రితం నిర్వహించిన జీవవైవిద్య సదస్సు(కాప్-11) సందర్భంగా విదేశీ అతిథులను ఆకట్టుకునేందుకు ‘నగర సుందరీకరణ పేరిట’ జీహెచ్ంఎసీ అధికారులు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్ల దిగువ స్తంభాలకు రంగులు, పక్క గోడలపై వర్ణచిత్రాలు తదితర పనుల పేరిట రూ.20 కోట్లు ఖర్చు చేశారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు అందరూ సహకరించాలని, గోడలపై వాల్‌పోస్టర్లు తదితరమైనవి అంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం చేశారు. దీనిని అధికార పక్షం నేతలే పాటించడంలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోచేరిన తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాతో సహా ఫ్లై ఓవర్ పొడవునా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఎంతో వ్యయంతో రూపొందించిన కళాఖండాలను సైతం ఖాతరు చేయలేదు. వాటిని మూసివేస్తూ తలసానికి అభినందనలు తెలుపుతున్న పోస్టర్లను అంటిచేశారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ‘ఈ క ళాఖండాలపై పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ’అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా, వాటి దిగువనే బేఖాతరుగా పోస్టర్లను నింపేశారు. గోడపై నోటీసులు, పోస్టర్లు అంటిస్తే చట్టపర చర్యలని మరోచోట ఉన్నా పట్టించుకోలేదు. మన సారే మంత్రి.. మనదే రాజ్యం.. పోస్టర్లపై సీఎం కూడా ఉన్నారు.. ఎవరేం చేస్తారు..? అనుకున్నారో ఏమో కానీ.. ఇలా నింపేశారు. సాధారణ ప్రజలపై కొరడా ఝళిపించే జీహెచ్ఎంసీ అధికారులు దీనికేం సమాధానం చెబుతారు..? ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన వారిని ఏమని ప్రశ్నిస్తారు..? ఈ మార్గం నుంచే నిత్యం సర్కారు ప్రముఖులు, అధికార గణాలు, ఇతరత్రా వీఐపీలు ఎందరెందరో వెళ్తున్నా.. ఎవరి దృష్టికీ రాకపోవడం.. వచ్చినా పట్టించుకోకపోవడం.. దేనికి సంకేతం..? -
ఎర్రచందనం చెట్లు పెంచుతాం
దక్షిణకొరియా జీవవైవిధ్య సదస్సులో హరితహారానికి అపూర్వ స్పందన అటవీమంత్రి జోగురామన్న హైదరాబాద్: రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. అలాగే, వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల చెట్లను నాటుతామని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ 12వ జీవవైవిధ్య సదస్సుకు హాజరై తిరిగి వచ్చిన మంత్రి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమం క్రింద అటవీ విస్తరణను పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్పథకం గురించి ఆ సదస్సులో వివరించగా మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. సర్పంచ్‌లు చైర్మన్‌గా మొత్తం 600 జీవవైవిధ్య కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 40 వేల చెట్లను నాటాలనే లక్ష్యాన్ని సదస్సులో వివరించినట్టు చెప్పారు. జీవవైవిధ్యంతో పట్టణాలను కూడా స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దాలని సదస్సులో సూచించారని తెలిపారు. అయితే భారత్‌లో 70 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారు కాబట్టి తెలంగాణలో మాత్రం ‘స్మార్ట్‌విలేజ్’లను అభివృద్ది చేయడం తమ లక్ష్యమని వివరించిన ట్టు ఆయన తెలిపారు. జీవవైవిధ్యానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని ఈ సదస్సు తీర్మానించిందని వివరించారు. ఎర్రచందనం చెట్ల పెంపకానికి ఏపీ భూములే అనువుగా ఉన్నాయనేది నిజం కాదని, తెలంగాణలోనూ వీటిని పెంచడానికి ఆస్కారం ఉందని మంత్రి పేర్కొన్నారు. పట్టాభూములలో వీటిని పెంచడానికి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జోగురామన్న తెలిపారు. ఎర్రచందనం పట్ల చైనా ఆసక్తి చూపుతుందని, దీనిని ఎగుమతి చేయకుండా ఇక్కడే ఫర్నిచర్‌ను తయారు చేయించి ఎగుమతి చేసే ఆలోచన ఉందన్నారు.