పదవులకన్నా ప్రజలే ముఖ్యం
అనంతపురం టౌన్ :
తనకు పదవులకన్నా ప్రజలే ముఖ్యమని మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లు మంత్రిగా సేవ చేశారని, ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇకపై పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు సమయం దొరికేది కాదని, ఇప్పుడు తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. సమాచార శాఖ మంత్రిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించామన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి జర్నలిస్టులు కూడా కారణమన్నారు. హంద్రీ నీవా నీటిని పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులకు తీసుకెళ్తామన్నారు. అనంత కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో మాట్లాడుతామని చెప్పారు.