విభజనకు సీఐడీ కార్యాలయం రెడీ
ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోకి తెలంగాణ సీఐడీ విభాగం
ఏసీ గార్డ్స్‌లోని సైబర్ క్రైమ్ భవనంలోకి ఏపీ సీఐడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు శాఖలో విభజన ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించే పని వేగవంతమైంది. అలాగే రెండు రాష్ట్రాలకు అధికారులు, సిబ్బంది, రికార్డుల విభజనకు అవసరమైన చర్యలను ఆ విభాగం అధిపతి టి.కృష్ణప్రసాద్ సోమవారం పూర్తి చేశారు. రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ విభజనకు సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సీఐడీ కార్యాలయంగా ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోని మూడో అంతస్తును నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రస్తుతం ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ సైబర్‌క్రైమ్‌తోపాటు మరికొన్ని విభాగాలు కొనసాగుతున్న భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ భవనం చిన్నగా ఉండటంతో దాని సమీపంలోనే మరో భవనాన్ని తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మౌలికసదుపాయాలు, రికార్డులు, కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు అధికారులు, సిబ్బందిని కూడా పంపిణీ చేసే ప్రక్రియకు కృష్ణప్రసాద్ తుది మెరుగులు దిద్దారు. వీటిని ఆమోదానికి డీజీపీ ద్వారా గవర్నర్ నరసింహన్‌కు పంపినట్టు తెలిసింది.