వైద్యం వర్రీ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్యం పడకేసింది. కీలకమైన వ్యాధి నిర్థారణ యంత్రాలు పాడైపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పదుల సంఖ్యలో వైద్య పరికరాలు పనిచేయకపోవడంతో రోగులకు కనీస వైద్యసేవలు అందడం లేదు. సాధారణ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ వైద్య పరికరాలతో పాటు.. ఖరీదైన ఎంఆర్ఐ యంత్ర పరికరాలు సైతం ఆయా బోధనాస్పత్రుల్లో అలంకారప్రాయంగా మారాయి. చిన్నచిన్న సాంకేతిక లోపాలతో పనిచేయకుండా పోయిన యంత్రాలకు రిపేరు చేయించి, వినియోగంలోకి తీసుకురావాల్సిన తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) ఈ అంశాన్ని పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా రూ.కోట్ల విలువ చేసే యంత్రాలు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో పాటు.. మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న నిరుపేద రోగులకు నిరాశే మిగులుతోంది.
తీరు మారని ‘గాంధీ’
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్దపీట వేసింది. తొలి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడమే కాకుండా వీటిలో60 శాతం నిధులు వైద్యపరికరాల కొనుగోలుకే వెచ్చించింది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా గాంధీ ఆస్పత్రిని తీర్చిదిద్దింది. 1,012 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో అనధికారికంగా రెండు వేల పడకలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం రెండు వేల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికోసం ఆస్పత్రిలో ఖరీదైన ఎంఆర్ఐ, సీటీ సహా మొత్తం 2400 వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 525కు పైగా వైద్య పరికరాలు పనిచేయకపోండం గమనార్హం. ఆస్పత్రిలో ఎంఆర్ఐ గత మూడు నెలలుగా పనిచేయడం లేదు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయ పడిన క్షతగాత్రులు, న్యూరో సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎలాంటి సేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు డయాగ్నోస్టిక్‌లకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ఎంఆర్ఐ కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య ఇప్పటికే మూడు వేలకుపైగా చేరుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు సీటీ మిషన్లు ఉండగా, వీటిలో 16 స్లైస్ సీటీస్కాన్ పనిచేయడం లేదు. హృద్రోగులకు సంబంధించి ఒక క్యాథ్‌ల్యాబ్ ఉండగా, దాని సేవలు కూడా నిలిచిపోయాయి.
ఉస్మానియాలో 100కు పైగా మూలకు..
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున రెండు వేల మంది రోగులు వస్తుండగా, అందులో 150 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుంటారు. అధికారికంగా 1,168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు ఉన్నాయి. నిత్యం 1400 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు 250 మంది వస్తుండగా, వీరిలో అత్యధికులు ప్రమాదాల్లో గాయపడిన వారు, పాయిజన్, పాముకాటు బాధితులు, సెప్టిసీమియా, న్యూరో సంబంధిత బాధితులే. ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో 1500 పైగా వైద్య పరికరాలు ఉండగా, వీటిలో ప్రస్తుతం వందకుపైగా పనిచేయడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. గత మూడు నెలలుగా ఇక్కడి క్యాథ్‌ల్యాబ్ పని చేయకపోవడంతో హృద్రోగులకు సరైన వైద్యం అందడం లేదు. కీలకమైన యాంజియోగ్రాం చికిత్సలు వాయిదా వేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా వ్యాధిని నిర్థారించేందుకు అవసరమైన పరికరాలు లేక.. ఉన్నవి కూడా పనిచేయక తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఏదైన వైద్య పరికరంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వైద్య పరికరాల వార్షిక మెయింటెనెన్స్ టెండర్ దక్కించుకున్న ‘ఫైబర్ సింధూరి’ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం తప్ప.. ఆస్పత్రి అధికారులు కూడా ఏమీ చేయ లేని దుస్థితి.
ముఖం చాటేసిన ‘ఫైబర్ సింధూరి’
నిర్వహణ లోపానికి తోడు వైద్య పరికరాలపై రోజంతా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల వాటిపై భారం పడుతోంది. ఫలితంగా కొనుగోలు చేసిన కొద్ది రోజులకే సాంకేతిక లోపాలు తలెత్తుతుంటాయి. వీటికి వెంటనే రిపేర్లు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన బయో మెడికల్ ఇంజినీర్లు ఆయా ఆస్పత్రుల్లో లేరు. యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలు కూడా సకాలంలో స్పందించక పోవడంతో చాలాకాలం వరకు ఆయా ఆస్పత్రులు తమ అభివృద్ధి కమిటీ నిధులతోనే పాడైన యంత్రాలకు మరమ్మతులు చేసుకునేవి. ఉస్మానియా, గాంధీ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో వైద్య పరికరాల వార్షిక నిర్వహణ, రిపేర్ల కోసం రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చెన్నైకి చెందిన ‘ఫైబర్ సింధూరి’ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఇందుకోసం వైద్య పరికరం వాస్తవ ధరపై 7 శాతం వార్షిక మెయింటెనెన్స్ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న వైద్య పరికరాల్లో ఒక్కో పరికరం ఒక్కో కంపెనీ నుంచి కొనుగోలు చేయడం, ఆయా కంపెనీల ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంపై మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఫైబర్ సింధూరి సంస్థకు అవగాహన లేకపోవడం, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు సమాచారం ఇస్తే.. స్పందించకుండా ముఖం చాటేస్తోంది. ఇదిలా ఉంటే తమ బకాయిలు చెల్లించేదాకా ఆయా పరికరాలను రిపేరు చేయసేది లేదని సదరు సంస్థ స్పష్టం చేయడం గమనార్హం.