Cyclone Yaas
-
భళా! ఒడిశా ప్రజలకు ప్రధాని ప్రశంసలు
భువనేశ్వర్: యాస్ తుపాను విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషిచేస్తాయని, ఒడిశా సంక్షేమ కార్యకలాపాల్లో రాష్ట్రంతో కలిసి కేంద్రం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. యాస్ తుపానుతో సంభవించిన నష్టాన్ని నివారించడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. తుపాను సహాయం, పునరావాసం, పునరుద్ధరణ, జీవనోపాధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. యాస్ తుపాను రాష్ట్రంలో 10 కోస్తా జిల్లాల్ని ప్రభావితం చేసింది. పలు చోట్ల సముద్రపు కెరటాలు తీరం దాటాయి. నది గట్లు తెంచుకున్నాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రధాని శుక్రవారం రాష్ట్రానికి విచ్చేసి గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో యాస్ తీవ్రత, నష్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యాస్ విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రజలు ప్రదర్శించిన సమయ స్ఫూర్తి కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలకు అదనపు బలం చేకూర్చాయని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ వెన్నంటి స్థైర్యం పెంపొందిస్తున్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఆలోచనలతో విపత్తు నిర్వహణ ముందస్తు విపత్తు నిర్వహణ కార్యాచరణతో యాస్ బీభత్సాన్ని రాష్ట్రప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కోగలిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాన మంత్రికి వివరించారు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ఏటా ప్రకృతి విపత్తుల్ని ఒడిశా ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. విపత్తుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రిని అభ్యర్థించారు. విపత్తు తాండవంతో కోతకు గురవుతున్న తీర ప్రాంతాలు, నది గట్ల సంరక్షణ, కుప్పకూలుతున్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించాలని కోరారు. యాస్ ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ, పనరావాసం కార్యకలాపాలు ప్రధానమంత్రికి వివరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ చంద్ర షడంగి ఈ సమావేశానికి హాజరయ్యారు. విహంగ వీక్షణం యాస్ నష్టంపై సమీక్ష ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాశ మార్గంలో యాస్ ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించి ఢిల్లీకి బయల్దేరారు. ఈ విహంగ వీక్షణం ఆధారంగా త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని సమావేశానికి హాజరైన కేంద్ర ప్రతాప్ చంద్ర షడంగి తెలిపారు. -
యాస్ తుపాను: మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్ల తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మెడినిపూర్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది. చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే -
ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన
-
యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
-
యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: యాస్ తుపాను గురువారం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇంకా బలహీనపడి తీవ్రత తగ్గుతుందని వివరించింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు సూచిస్తూ, దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని స్పష్టం చేసింది. నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో చాలాభాగం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొంతభాగం వరకు బలమైన గాలులు ప్రవేశించాయని వివరించింది. రాష్ట్రానికి పశి్చమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఓ మాదిరి వానలు పడతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి
‘యాస్’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
Cyclone Yaas: అదనంగా 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 32వేల ఆక్సిజన్ బెడ్స్‌కి 660 మెట్రిక్ టన్నులు ప్రాణ వాయువు కావాలి. కానీ కేంద్రం ఇచ్చేది 590 మెట్రిక్ టన్నులు మాత్రమే. దాంతో ప్రతిరోజూ అదనంగా 150 మెట్రిక్ టన్నులు తీసుకొస్తున్నాం’’ అన్నారు కృష్ణబాబు. ‘‘యస్ తుపాను వల్ల ఇబ్బందులొస్తాయని ముందస్తుగా.. అదనంగా 400 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ తీసుకొచ్చాం. ఇప్పటివరకు జామ్‌నగర్ నుంచి నాలుగు ఆక్సిజన్ రైళ్లు వచ్చాయి. ఆక్సిజన్ రవాణా కోసం 92 లారీలను వినియోగిస్తుండగా.. సరఫరా కోసం 16 కంటైనర్లను ఏర్పాటు చేశాం. ప్రైవేట్ సెక్టార్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం పాలసీని ప్రకటించారు. 120 కోట్ల రూపాయలతో ఆస్పత్రుల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నాం అని కృష్ణబాబు తెలిపారు. -
Hottest Summer: ‘రికార్డు’ భగభగలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. -
Cyclone Yaas: ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
-
ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న యాస్ తుపాన్
-
YS Jagan: అప్రమత్తతతో ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: యాస్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తుపాను కదలికలకు అనుగుణంగా అవసరమైన చర్యలను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. యాస్ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెద్దగా ప్రభావం కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని, తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ కొరత రాకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంకు నివేదించిన వివరాలు ఇలా ఉన్నాయి. సర్వసన్నద్ధంగా ఉన్నాం ► ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వచ్చిన పక్షంలో వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు. ► విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు తుపాను ప్రభావం ఏమీ కనిపించలేదని, అయినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. కోవిడ్ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తుగా డీజిల్, మందులు, ఆక్సిజన్‌ను నిల్వ ఉంచామని చెప్పారు. ► విశాఖలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అయినా సరే.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు, సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 80 ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు తీరం దాటనున్న 'యాస్'
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్ తుపాను మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లోని పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతూ 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో యాస్ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి అనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుఫాన్ కారణంగా రాజస్థాన్ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 48 గంటల్లో మాల్దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అప్రమత్తమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్... ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో యాస్ తుపాను ప్రభావం తీవ్రంగాను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై స్వల్పంగా ఉండటంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే వంతెనలు, నదుల సమీపంలోని రైల్వే ట్రాక్స్, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కాలువలు పొంగి ట్రాక్‌లు దెబ్బతినకుండా ముందస్తు చర్యలుగా పూడికతీత పనులు ప్రారంభించారు. వాల్తేరు డివిజన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలూ తుపాను పరిస్థితిని పసిగట్టేందుకు విశాఖ డివిజన్‌తో పాటు భువనేశ్వర్‌లోని హెడ్‌క్వార్టర్స్, ఖుర్దారోడ్, సంబల్పూర్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా మరో మూడు ప్రత్యేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్–గౌహతి (06577), చెన్నైసెంట్రల్–భువనేశ్వర్ (02840), 30న పూరి–చెన్నైసెంట్రల్ (02859) రైళ్లను రద్దుచేసింది. -
Yaas Cyclone: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం
పశ్చిమ బెంగాల్: యాస్ తుపాన్‌తో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం మమత బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రికి సెక్రటేరియట్‌లోనే సీఎం మమత బెనర్జీ ఉండనున్నారు. నిరంతరం తుపాను పరిస్థితిని సమీక్షించనున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారి, రేపు ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చదవండి: Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్ యాస్, కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటాం: సీఎం -
Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: యాస్ తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని తెలిపారు. సీఎస్ ఆదిత్యనాథ్ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని సీఎస్ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేశాం అని ఆదిత్యనాథ్ సీఎం జగన్‌కు తెలిపారు. చదవండి: Cyclone Yaas: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ -
అతితీవ్ర తుపానుగా బలపడిన యాస్ తుపాను
-
తూర్పు తీరంలో 'యాస్' అలజడి
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాన్ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 710 కి.మీ, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 450 కి.మీ, బాలాసోర్‌కి ఆగ్నేయ దిశగా 550 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల మధ్య కేంద్రీకృతమైంది. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపాన్‌గా, 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య చాలా తీవ్రమైన తుపాన్‌గా మారి బుధవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అతి తీవ్ర తుపాన్‌గా మారినప్పుడు గంటకు 135 నుంచి 160 కి.మీ. వేగంతో, తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కి.మీ, గరిష్టంగా 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం అలజడిగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. – ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై మాత్రమే కొంత వరకు ఉంటుందని వెల్లడించారు. – శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు మేఘావృత వాతావరణం ఉంటుందని, అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. – ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు, రేపు ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఉత్తరకోస్తా తీరంలో గంటకు 140–160, గరిష్టంగా 185 కి.మీ వేగంతో కోస్తా తీరం వెంట గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. – తీరం వెంట బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. – మత్స్యకారులు ఈ నెల 27వతేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. – విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. – వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. – తుపాన్ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. – గడిచిన 24 గంటల్లో జూపాడు బంగ్లాలో 4 సెంమీ, దర్శి, మర్రిపూడి, చీమకుర్తి, పగిడ్యాల, గుత్తి 3 సెంమీ, ముండ్లమూరు, యర్రగొండ్లపాలెం, వెలిగండ్ల, పొదిలి, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, ఊటుకూరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ తుపాను పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా ముఖ్యమంత్రులతోపాటు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై ప్రభావం స్వల్పంగానే ఉండే అవకాశాలున్నప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. మే 22న కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నిర్వహించిన సమావేశానికి అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. -
ఆటంకం లేకుండా ఆక్సిజన్
విద్యుత్తు.. ఆక్సిజన్ కీలకం ‘‘తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. తుపాను వల్ల ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు తలెత్తితే ముందే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలి. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో సమస్యలు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కేటాయించాలి. తుపాను ప్రభావిత సమయాల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి కల్లా ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఉండాలన్నారు. సొంతంగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పే ప్రైవేట్ ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యానికి తగినట్లుగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలో కోవిడ్, తుపాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ‘యాస్’ తుపాను వల్ల ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రోజువారీ సరఫరా, నిల్వలపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ విశాఖపట్నం వెళ్లారు. సీఎం వైఎస్ జగన్ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ... కోవిడ్, తుపాన్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్, మంత్రి ఆళ్ల నాని తదితరులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. తుపాన్ నేపథ్యంలో రోజువారీ అవసరమైన ఆక్సిజన్ సరఫరాతో పాటు నిల్వల వివరాలు పరిశీలిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. 15 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రప్పిస్తున్నందున నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలి. కోవిడ్ బాధితుల తరలింపులో జాగ్రత్త.. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్పత్రుల నుంచి కోవిడ్ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి తరలించాలో గుర్తించి తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని జాగ్రత్తగా తరలించాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే ఇప్పుడే ఆ పని చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలి. సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు అన్ని సదుపాయాలు కల్పించాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమీక్షించుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజీలు – టెండర్లు.. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయాలి. జూన్ 10 కల్లా మిగిలిన కాలేజీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. జులై నుంచి మెడికల్ కాలేజీల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. విమ్స్, విక్టోరియాలో చురుగ్గా నాడు – నేడు ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలతో పాటు అదనంగా విశాఖలోని విమ్స్, విక్టోరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులకు చురుగ్గా టెండర్ల ప్రక్రియ చేపట్టాలి. ఆగస్టు నెలాఖరు కల్లా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అనుకున్న సమయానికి పనులు ప్రారంభం కావాలి. కార్పొరేట్ స్థాయిలో బోధనాస్పత్రుల నిర్వహణ.. కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగానే బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాలి. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ నాణ్యంగా ఉండాలి. పది కాలాల పాటు రోగులకు మంచి సేవలు అందించేలా అన్ని బోధనాసుపత్రులు ఉండాలి. ఈ ఆస్పత్రులను ఏ విధంగా నిర్వహిస్తారన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందించండి. కోవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితులపై బ్లాక్ ఫంగస్‌తోపాటు కొత్తగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసురుతున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. తగినన్ని ఇంజెక్షను తెప్పించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఆ చిన్నారుల పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 34 మంది చిన్నారులను ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారులు తెలియచేయడంతో ఆర్థిక అవసరాలు తీర్చేలా వెంటనే వారందరి పేరు మీద రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 18,763 మంది సిబ్బంది నియామకం రాష్ట్రంలో ప్రస్తుతం 36,475 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 18,763 మంది వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బందిని నియమించామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి 590 టన్నుల ఆక్సిజన్ కేటాయింపులు ఉండగా ప్రస్తుతం రోజూ దాదాపు 640 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని తెలిపారు. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యాస్ తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
-
ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది: సీఎం వైఎస్ జగన్
-
Cyclone Yaas: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సిలెండర్లకు రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్లనుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్లను అవసరమనుకుంటే.. తరలింపు ఇప్పుడే పూర్తికావాలని తెలిపారు. ‘‘కోవిడ్ కేంద్రాలకు కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తి స్థాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పునఃసమీక్షించుకుని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న సీఎం జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ముందడుగు -
తుఫాన్ నేపథ్యంలో విశాఖలో ముందస్తు జాగ్రత్తలు
-
అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. యాస్ తుపాను హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుపాను కదలికలను పరిశీలిస్తే ఏపీ పై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని సీఎం వైఎస్ జగన్ వివరించారు. చదవండి: ‘యాస్’ తుపాన్ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు ఆనందయ్య మందుపై అపోహలొద్దు: ఆళ్ల నాని -
నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
-
‘యాస్’ తుపాన్ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాన్ కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా విజయవాడ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలివీ.. ఈ నెల 23వ తేదీ: భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక రైలు (02845) 24వ తేదీ: హౌరా–వాస్కోడిగామ (08047/08048) 27వ తేదీ: తిరువనంతపురం–షాలీమార్ (02641), హౌరా–తిరుచిరాపల్లి (02663), చెన్నై సెంట్రల్–సంత్రగచ్చి (02808), యశ్వంత్‌పూర్–హౌరా (06597) 28వ తేదీ: పురులియా–విల్లుపురం (06169), హౌరా–మైసూర్ (08117) 29వ తేదీ: తాంబరం–జసిది జంక్షన్ (02375), కన్యాకుమారి–హౌరా (02666), హౌరా–యర్నాకులం (02877), 30వ తేదీ: హౌరా–పుదిచ్చేరి (02867) -
Cyclone Yaas: ముంచుకొస్తున్న తుపాన్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది. అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర దిశలో 560 కి.మీ దూరంలో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 26వ తేదీ ఉదయం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి.. పారాదీప్ – సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో టెక్కలి, పాతపట్నం, పమిడిలో 4 సెంమీ, కళింగపట్నం, వీరఘట్టం, యలమంచిలి, కైకలూరు, నర్సీపట్నం, భీమవరం, విజయనగరంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. భారీగా సహాయక సామాగ్రి సిద్ధం ► భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. భారత వాయుదళం (ఎయిర్‌ఫోర్స్) 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌కు పంపించారు. ► 15 ఎయిర్క్రాఫ్టŠస్ ద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు పంపించారు. మరో 16 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, 26 హెలికాఫ్టర్లను సహాయక చర్యల కోసం పశ్చిమ తీరంలో సిద్ధంగా ఉంచారు. ► తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన భువనేశ్వర్, కోల్‌కతాకు 10, పోర్ట్‌బ్లెయిర్‌కు 5 విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నుంచి రెస్క్యూ బృందాలతో నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. కోవిడ్ నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. అదనపు ఆక్సిజన్ నిల్వలు సిద్ధం సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం యాస్ తుపానుగా తీవ్రరూపు దాల్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న మూడు ప్లాంట్లతోపాటు అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రెండు రోజులుగా ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నాం. తద్వారా అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బఫర్ నిల్వలు ఉండేట్టుగా చూస్తున్నాం. ►ఇప్పటికే ఒడిశాలోని రూర్కెలా నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించింది. సోమవారం నాటికి మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు రైలు ద్వారా రానున్నాయి. ► రూర్కెలా, కళింగ నగర్, అంగూల్ నుంచి రోడ్డు మార్గంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సవ్యంగా తీసుకువచ్చేందుకు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ తెప్పించిన 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆదివారం విశాఖపట్నం పోర్ట్ వద్ద ప్రభుత్వానికి అందించింది. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేసింది. ► తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ►సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.