పర్యాటక ప్రాజెక్టులకు నిధులు మంజూరు
కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ. 99.42 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడించారు. మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కార్యాలయానికి వచ్చిన కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ తెలంగాణకు చెందిన పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు.
అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడుతూ కుతుబ్షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూంబ్స్, హయత్ బక్షీ మసీదు తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశామన్నారు. తెలంగాణ టూరిజం అధికారులతో సమావేశమైన అనంతరం మరిన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు.