ఢిల్లీలో ఉబర్ క్యాబ్‌లపై నిషేధం
రేప్ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు చర్య
గతంలోనూ రేప్ కేసులో జైలుకెళ్లిన ఉబర్ డ్రైవర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్ ప్రైవేట్ క్యాబ్ సర్వీస్‌కు చెందిన ఓ డ్రైవర్ తన క్యాబ్‌లో ఓ ఫైనాన్స్ ఉద్యోగిని(27)పై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఆ కంపెనీ కార్యకలాపాలపై సోమవారం నిషేధం విధించింది. అమెరికాకు చెందిన ఆ కంపెనీ.. రాజధానిలో ఇక ఎలాంటి రవాణా సేవలూ అందించకుండా బ్లాక్‌లిస్టులో ఉంచింది. సేవల విషయంలో ఉబర్ బాధితురాలిని తప్పుదోవ పట్టించిందని, www.uber.com ద్వారా అందిస్తున్న సర్వీసులన్నింటిని తక్షణం నిషేధిస్తున్నామని పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా ఉబర్ సర్వీసులను నిషేధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.
ఉబర్ హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో సర్వీసులు నడుపుతోంది. కాగా, శుక్రవారం నేరానికి పాల్పడిన నిందితుడు శివకుమార్ యాదవ్‌ను(32) పోలీసులు సోమవారం ఢిల్లీ తీస్ హజారీ కోర్టుకు హాజరుపరచగా జడ్జి మూడు రోజుల పోలీసు కస్టడీకి విధించారు. యాదవ్‌ను జడ్డి గుర్తింపు పరేడ్ కు ఆదేశించగా అతడు నిరాకరించాడు. బాధితురాలు తన ఫోటోను ఉబర్ వెబ్సైట్లో చూసింది కనుక తనను గుర్తించగలదన్నాడు. తాను గతంలోనూ ఓ అత్యాచారం కేసులో ఏడు నెలలు జైల్లో ఉండి నిర్దోషిగా బయటపడ్డానని యాదవ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. 2011లో యాదవ్ పబ్‌లో పనిచేసే ఓ యువతిని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలు మాట మార్చడంతో నిర్దోషిగా బయటపడ్డాడు.
ఉబర్ కంపెనీ యాదవ్ గత చరిత్రను తనిఖీ చేయకుండా ఉద్యోగమిచ్చిందని, దర్యాప్తు తర్వాతా అతని ఫోన్‌కాల్స్ వివరాలు అందించలేకపోయిందని పోలీసులు తెలిపారు. అతని గత చరిత్రను తెలుసుకుని ఉంటే తాజా ఘటన జరిగేది కాదన్నారు. ఢిల్లీలో ‘నిర్భయ’ సామూహిక అత్యాచారానికి రెండేళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో తాజా దారుణం చేసుకోవడంతో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. కాగా, ఈ ఘటనపై సోమవారం కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో స్పందిస్తూ.. నేరస్తుడిని శిక్షించడానికి, భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్‌నాథ్ ఇంటి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.