ఇదేం పాలన?
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా స్పందిస్తోంది. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ఇష్టారాజ్యమైంది. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర జఠిలంగా మారింది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి చర్యలు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత ఆదాయ మార్గాలపై ఉన్న ప్రత్యేక చొరవ జిల్లాభివృద్ధిపై కన్పించడం లేదు. వెర సి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలకు జిల్లాలో తావు లేకుండా పోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను అందివచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారు. యథేచ్ఛగా అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఇసుక, మైనింగ్, ఎర్రచందనం కారణంగా పాలకపక్షం నాయకుల అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం సూచించిన దానికంటే పది రెట్లు ఎక్కువగా ఇసుక అక్రమంగా తరలుతోంది.
పగలు ప్రభుత్వ డంప్‌లకు.. రాత్రులు అక్కడి నుంచి ఇతర చోట్లకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. జిల్లాలో పాలనను గాడిలో పెట్టాల్సిన అత్యున్నతాధికారి తనకు ఏది నచ్చితే అదే కరెక్టు అన్నట్లుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. సమస్యలపై ప్రజలు ఏకరువు పెట్టినా కనీస స్పందన ఉండడం లేదని పలువురు ఊదాహరణలతో సహా వివరిస్తున్నారు.
తాగు నీటి సమస్య తీవ్రం
జిల్లా వ్యాప్తంగా 463 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. ట్రాన్సుపోర్టర్లు ఆశించిన మేరకు నీరు సరఫరా చేయడం లేదు. సమీక్షించించి తగు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం మిన్నకుండి పోయింది. ట్రాక్టర్‌కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్సుపోర్టు ఆపరేటర్లు నీటి సరఫరాకు వెనకాడుతున్నారు.
ఇలాంటి పరిస్థితి జిల్లాలో డిసెంబర్ నుంచే ఉత్పన్నమైంది. ప్రస్తుతం మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. నీటి సమస్యను పరిష్కరించాల్సిన యంత్రాంగం.. ఇసుకపై మరింత ఆదాయాన్ని ఎలా పొందాలి.. ఎర్ర చందనాన్ని ఎలా విక్రయించాలి.. మంగంపేట బరైటీస్ను ఎలా కొల్లగొట్టగలగాలి.. అన్న ధోరణిలో నిమగ్నమైందని బాహాటంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తూ భూగర్భ జలాలు మరింత అధఃపాతాళానికి వెళ్లేలా వ్యవహరిస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. జిల్లాలో 48 మండలాల్ని కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించడం మినహా ప్రత్యేక శ్రద్ధ చూపి సహాయక చర్యలు చేపట్టడ ంలో యంత్రాంగం విఫలమైంది. పశువులకు గ్రాసం లేదు.
వలసల నివారణకు ఉపాధి కల్పన ఆశించిన స్థాయిలో లేదు. కరువు నేపథ్యంలో ఉపాధి పనుల్లో ప్రజాప్రతినిధుల అభ్యర్థనకు తగిన గుర్తింపు లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడి, పంటల ఇన్స్యూరెన్సు 2011-14 వరకూ పెండింగ్‌లో ఉంది. ఇన్ని సమస్యలతో జనం సతమతమవుతుంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
టీడీపీ నేతల పట్ల మాత్రమే శ్రద్ధ
జిల్లా ప్రజల పట్ల, జిల్లాభివృద్ధి పట్ల ఏమాత్రం చొరవ చూపెట్టని యంత్రాంగం తెలుగు తమ్ముళ్ల పట్ల ప్రత్యేక చొరవ చూపుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా సరే పోట్లదుర్తి బ్రదర్స్ ఆదేశిస్తే గంగిరెద్దులా తలూపుతూ వ్యవహారం చక్కబెట్టుతోన్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో చేపడుతోన్న అక్రమ మైనింగ్ వ్యవహారమే.
సర్వే నంబర్ 221లో క్వారీకి అనుమతి కోసం ముద్దనూరు మండల వాసులు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ భూమి పశువుల మేత పరంబోకు అంటూ మైనింగ్ అధికారులు తిరస్కరించారు. అదే సర్వేనంబర్‌లో మైనింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోట్లదుర్తి బ్రదర్స్‌లో ఒకరు దరఖాస్తు చేసుకున్నారు.
ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చేందుకు రెవిన్యూ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. అనుమతులు ఇచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు మార్గం సుగమం చేస్తోంది. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహాశీల్దారు, మైనింగ్ యంత్రాంగం ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అనుమతులు రాకుండానే యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుంటే అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యలన్నింటిపై నేడు (మంగళవారం) నిర్వహించనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించాలని ప్రజలు కోరుతున్నారు.