కళ్లు చూసి వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు!
న్యూఢిల్లీ: ఇంతవరకు ఒకరి చేతిరాతిను బట్టి, వారు పడుకునే పొజిషన్ ఆధారంగా, బాడీ లాంగ్వేజ్‌ను అనుసరించి వారి పర్సనాలిటీ చెప్పొచ్చనే విషయం తెలుసు. కానీ కళ్ల వర్ణాన్ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో ఒక్కొక్కరి కళ్లు ఒక్కో రంగులో ఉంటాయి. ఆయా రంగులను అనుసరించి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మధు కోటియా చెబుతున్నారు. ఆమె అంచనాలు ఇవి..
నల్ల కళ్లు:
ఈ రంగు కళ్లను చూడగానే ఏదో రహస్యాన్ని కలిగా ఉన్నాయి అనే భావన కలుగుతుంది. అయితే వీరు ఎక్కువ విశ్వాసులై ఉంటారు. ఒకరి రహస్యాలను మరొకరితో పంచుకోరు. బాధ్యతాయుతంగా, విధేయంగా ఉండడంలో వీరి తర్వాతే ఎవరైనా. తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వారికి బాగా తెలుసు. ఎక్కువ కష్టపడే గుణం వీరి సొంతం.
గోధుమ రంగు కళ్లు:
ఈ రంగు కళ్లు కలిగిన వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీరు ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతను కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు.
లేత గోధుమ రంగు కళ్లు:
ఈ రంగు కళ్లున్నవారు ఎక్కువ సరదాగా ఉంటారు. ఇతరులను ఎక్కువగా నవ్వించే స్వభావం వీరికి ఉంటుంది. సాహసాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. సందర్భోచితంగా, సమయానుకూలంగా మెలిగే నేర్పుని కలిగి, ఏ పరిస్థితినైనా అర్థం చేసుకుంటారు. మంచి మనసు కలిగి ఉండే వీరు ఒకే తరహాగా ఉండేందుకు ఇష్టపడరు. వీరు ఎదుటివారిని త్వరగా ఆకర్షించగలిగినప్పటికీ ఇతరులతో ఎక్కువ కాలం ఆ బంధాన్ని కొనసాగించలేరు.
బూడిద రంగు కళ్లు:
ఈ రంగు కళ్లు ఉంటే వారు దృఢ చిత్తులై, హుందాతనంతో వ్యవహరిస్తారు. కొంచెం ఆధిపత్య స్వభావం వీరి సొంతం. గొడవలు, కోపానికి వీలైనంత దూరంగా ఉంటారు. శక్తియుక్తులన్నింటినీ లక్ష్యంపైనే పెడతారు. ప్రేమ, అనురాగాలు వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారి మానసిక బలం, ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక ధోరణి వారిని ఏ పరిస్థితిలోనైనా నెగ్గుకు రాగలిగే నాయకులుగా మారుస్తుంది.
పచ్చ రంగు కళ్లు:
ఈ రంగు కళ్లున్న వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సుకత ప్రదర్శిస్తారు. జీవితంపై, అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కానీ వీరికి త్వరగా అసూయపడే స్వభావం ఉంటుంది.
నీలి రంగు కళ్లు:
ఎదుటివారిని త్వరగా ఆకర్షించడం, శాంతియుతమైన ధోరణి కలిగి ఉండడం ఈ రంగు కళ్లున్న వారి ప్రత్యేకత. చాలా తెలివితేటలు కలిగి ఉండడమే కాకుండా, ఇతరులతో అనుబంధాల్ని ఎక్కువ కాలం కొనసాగిస్తారు. నిజాయితీ, దయ లాంటి లక్షణాలతో ఇతరులు సంతోషంగా ఉండడానికి తోడ్పడతారు. చుట్టుపక్కల విషయాల్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తారు.