వాడీవేడిగా..
అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష
► సమస్యలపై గళం విప్పిన ప్రజాప్రతినిధులు
► పరిష్కరించాలని అధికారులకు సూచన
► నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు
► ఇకపై 3 నెలలకోసారి అభివృద్ధిపై సమీక్షిస్తాం
► మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
జిల్లా అభివృద్ధిపై వాడీవేడిగా చర్చ జరిగింది. మూడు గంటలకుపైగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రైతు సమగ్ర సర్వే, విద్యుత్ సరఫరా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై లోతుగా చర్చించారు. మంత్రి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు లేవనెత్తారు. వాటి పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అధికారుల వైఖరిని ఎండగట్టారు. వచ్చే సమావేశంలోగా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లోటుపాట్లను సవరించి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా : జిల్లాలో అభివృద్ధి పనులను పరవళ్లు తొక్కించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఏ శాఖలోనూ ఆలస్యానికి తావివ్వకుండా సకాలంలో పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులకు సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు – మిగతా 6లోuసూచించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జెడ్పీ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా విస్తృతంగా చర్చించారు. అక్కడక్కడా చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ పథకాల అమలుకు కొన్ని సలహాలు అందిచ్చారు. గొర్రెల పంపిణీ పథకాన్ని గొల్ల, కురుమ, యాదవులకే కాకుండా.. వాటి పెంపకంపై ఆధారపడిన ఇతర కులాల కుటుంబాలకూ వర్తింపజేసే దిశగా ఆలోచించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
అయితే ఎంపీ సూచనపై ఎమ్మెల్యే అంజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదవ కుటుంబాలకు కేటాయించిన నిధులను ఇతరులకు మళ్లిస్తే ఒప్పుకోబోమన్నారు. ఇతర కులాల వారికి పంపిణీ చేస్తామంటే తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని.. కాకపోతే వేరే నిధులను ఖర్చు చేయాలన్నారు. దీనిపై మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతరులకు గొర్రెలను అందజేయాలని ఇప్పటికే తమకు వినతులు అందాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన సమాధానమిచ్చారు. గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా ఆవాసాల వారీగా గొర్రెకాపరుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. అయితే అలా చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని పశుసంవర్థక శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్‌రెడ్డి వివరించారు. గొర్రెల లభ్యతపై ఎటువంటి సందేహాలూ వద్దని, జిల్లాకు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో జిల్లా నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ సుందర్ అబ్నార్, సీపీఓ వైఆర్‌బీ శర్మ, జెడ్పీ సీఈఓ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంశాల వారీగా సమీక్ష..
చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రజలు బిందెలు చేతబట్టి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అరకొరగానే జరుగుతోందన్నారు. కొన్ని ఊళ్లకు అది కూడా లేదని చెప్పారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కల్వకుర్తి నియోజకవర్గంలో కృష్ణా మూడో దశ కింద పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారు. అయినా గ్రామాలకు నీరు సరఫరా కావడం లేదు. ట్రయల్ రన్ పేరిట కాలం గడుస్తున్నా కడ్తాల్, ఆమన్‌గల్ మండలాలకు నీళ్లు దిక్కులేవు’ అని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను అధికారులు సైతం గుర్తించడం లేదన్నారు. ‘మిషన్ భగీరథ నీరు వచ్చే వరకు దాదాపు ఏడెమినిది నెలలు పడుతుంది.
అప్పటివరకు గ్రామీణ నీటి సరఫరా నిర్వహణకు నిధులు ఉన్నాయా’ అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన పైపులైన్లు మినహా ఇస్తే.. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ల పనులపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేస్తేనే ప్రజలకు నీరందుతుందున్నారు. తన నియోజకవర్గంలోని చించోడు గ్రామంలో తప్ప అన్ని పల్లెల్లో నీటి కరువు ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. అధికారులు మౌనం పాటిస్తున్నారే తప్ప ప్రభుత్వానికి నివేదించడం లేదన్నారు. మిషన్ భగీరథలో భాగంగా డిసెంబర్ నెలాఖరులోగా ట్యాంకుల నిర్మాణం, భూగర్భ పైపులేన్లు వేయడం పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు.
కలెక్టరేట్ ఏర్పాటుపై తర్వలో సమావేశం
బెంగళూరు రహదారి వెంట వ్యవసాయ యూనివర్సిటీ స్థలంలో కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేసే అంశాన్ని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తిరస్కరించారు. జిల్లా భౌగోళిక పరిస్థితులకు ఆ ప్రాంతం ఏమాత్రం అనువైంది కాదని తేల్చేశారు. కలెక్టరేట్ ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా సోమవారం జిల్లాలో పర్యటించి.. వ్యవసాయ వర్సిటీ స్థలం పట్ల కాస్త సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్డీకపూల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు.. వర్సిటీ స్థలాలు కనీసం పది కిలోమీటర్ల దూరంలో కూడా లేవని, అక్కడ ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌లోనే ఉన్నట్లు భావన కలుగుతుందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. కొత్త కలెక్టరేట్‌కు అన్ని ప్రాంతాలు 30 నుంచి 35 రేడియస్ దూరంలో ఉండేలా చూడాలన్నారు. వర్సిటీలో నిర్మిస్తే.. చాలా మండలాలకు వ్యయప్రయాసాలు తప్పవన్నారు. కలెక్టరేట్ చేరుకోవాలంటే కొందరు ప్రజలు దాదాపు 100 కిలోమీటర్లు, ఇంకొందరు 35 కి.మీ మేర ప్రయాణించాల్సి ఉండడం ఇబ్బందికరమన్నారు.
దీనిపై స్పందించిన మంత్రి.. ఎంపీ, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వచ్చే ఏకాభిప్రాయం మేరకే కొత్త కలెక్టరేట్ నిర్మించేలా ప్రభుత్వానికి నివేదిద్దామని వారికి నచ్చజెప్పారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే.. వర్సిటీ స్థలంలో బదులు జెడ్పీ కార్యాలయంలోనే నిర్మిస్తేనే సౌకర్యవంతంగా ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.