తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు.
మరోవైపు తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
విజయవాడలో సంగమం, పద్మావతి, కృష్ణవేణి, వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరులో అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు.
నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది.