చెడును ఎలా వదిలించుకోవాలి?
ఒకరోజున బుద్ధుడు రాజగృహ నగర సమీపంలో, ఒక గ్రామంలో ధర్మప్రబోధం చేస్తున్నాడు. మనసును నిర్మలంగా ఉంచుకోవడం ఎలాగో చెప్తున్నాడు. ఆ ప్రబోధం విన్న సుధాముడనే యువకుడు ‘‘భంతే! నేను ఇప్పటిదాకా కొన్ని చెడ్డపనులు చేశాను. చెడు ఆలోచనలతో గడిపాను. ఇకనుండి మంచి ఆలోచనలతో జీవిస్తే సరిపోతుందా?’’ అని అడిగాడు.
‘‘సుధామా! అది మాత్రమే సరిపోదు. నీవు ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నావనుకో. కొంత దూరం పోయాక ఆ పడవ అడుగున పగులు ఏర్పడి పడవలోకి నీరు వచ్చేస్తోంది. అలా పడవ నీటితో నిండితే మునిగిపోతుంది. అప్పుడు నీవేం చేస్తావు?’’ అని అడిగాడు.
‘‘భగవాన్! పడవలోని వచ్చిన నీటిని తోడేస్తాను. ఇంక పడవలోకి నీరు రాకుండా ఆ పగులును పూడ్చేస్తాను’’అన్నాడు.
‘‘మన మనస్సును కూడా ఇలాగే జాగ్రత్త పరచుకోవాలి. కొత్తగా చెడ్డ ఆలోచనలు రాకుండా పగులును పూడ్చాలి. వచ్చిన చెడ్డ ఆలోచనలు మనలో లేకుండా పడవలోకొచ్చిన నీటిని తోడిపారేసినట్టే తోడిపారేయాలి. ఈ రెండు పనులూ చేస్తేనే మనం చెడ్డతనం నుండి దూరం కాగలం’’ అని చెప్పాడు బుద్ధుడు.
బుద్ధుని ప్రబోధాన్ని విన్న సుధాముడు క్రమేపీ తన మనస్సులోని చెడ్డ భావాల్ని తొలగించుకుని మంచి భిక్షువుగా రాణించాడు.
- బొర్రా గోవర్ధన్