మా ఆసరాకు మన ఆసరా
పిల్లలకు రక్తదానం చేయాలి అన్న ఒకే ఒక స్పృహతో ‘మా ఆసరా’ మొదలుపెట్టినప్పుడు తలసీమియా వ్యాధి గురించి దేచిరాజు మాలతికేమీ తెలియదు. ఆ మాటకొస్తే ‘మా ఆసరా’ ఆర్గనైజేషన్‌కూ పెద్ద అవగాహన లేదు. కానీ ఒకరోజు ఆమెకు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆమె ఆలోచనా దృక్పథాన్నే మార్చేసింది. ‘రిథమ్ ఆఫ్ లైఫ్’ అనే కాన్సెప్టుకు ఊపిరిపోసింది.
రెండేళ్ల క్రితం ఓ రోజు ఖమ్మం జిల్లా పాల్వంచ, సాక్షి రిపోర్టర్ నుంచి మాలతికి ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ఇక్కడి తండాలో ఓ ఆర్నెల్ల పిల్లాడున్నాడు. వాడికి ఏదో జబ్బు వచ్చి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. దానికి యాభై లక్షలు ఖర్చువుతుందట. మీరేమైనా ఆర్థిక సహాయం అందించగలరా?’’ అని. పిల్లాడిని తీసుకొని హైదరాబాద్ రమ్మనండి అని చెప్పారు మాలతి. పిల్లాడిని హైదరాబాద్ తీసుకువచ్చిన తల్లిదండ్రులను ‘మా ఆసరా’ గ్రూప్‌లోని ఇద్దరు సభ్యులకు పరిచయం చేసి వాళ్లతో నిలోఫర్ హాస్పిటల్‌కు పంపించారు మాలతి. పిల్లాడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ‘తలసీమియా’ అని తేల్చారు.
తలసీమియాకూ ‘మా ఆసరా’
ఆ సందర్భంగా, తలసీమియా గురించి సరైన అవగాహన లేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పోగొట్టుకుంటున్నారు అని గ్రహించిన మాలతి ఈ వ్యాధి మీద ‘మా ఆసరా’ తరపున గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులూ నిర్వహించడం మొదలుపెట్టారు అయినా ఈ సేవ సరిపోదు. ఏదైనా చేయాలి. చేయాలీ అంటే డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఎలాంటి సేవైనా చేయొచ్చు అన్న తన మాటనే... డబ్బుతో అత్యంత అవసరమున్న సేవను కొంతైనా చేయొచ్చు అని తిరిగి చెప్పుకున్నారు. ఆ మాటకు ఆచరణ రూపమే... రిథమ్ ఆఫ్ లైఫ్.
ఫిల్టర్ పాయింట్ ఒక్కటే!: తలసీమియా పిల్లలకు తరచు రక్తం ఇవ్వాలి. అయితే ఆ పిల్లలకు ఇచ్చే రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ ఒక్క హైదరాబాద్‌లోనే, అదీ ఛత్తాబజార్‌లోని ల్యుకో డిప్లెషన్ ఫిల్టర్ తలసీమియా సిక్లీసెల్ సొసైటీలో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాళ్లయినా, తెలంగాణలోని ఆదిలాబాద్ వాళ్లయినా పిల్లల్ని తీసుకొని ఇంతదూరం నెలకు కనీసం రెండుసార్లయినా రావాల్సి ఉంటుంది. ఎంత కష్టం? ఎంత ఖర్చు! దీనికి పరిష్కారం ఆలోచించాలి.
అది డబ్బుతో ముడిపడ్డది. అయినా సరే ముందుకెళ్లాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడే రిథమ్ ఆఫ్ లైఫ్ మాలతి మదిలో మెదిలింది. వెంటనే ఫేస్బుక్లో ఉన్న తమ రైటర్స్ గ్రూప్‌తో చర్చించారు. అందరూ రైటర్సే కాబట్టి వాళ్లకు నచ్చిన అంశంమీద ఓ పాట రాయమని, అలా ఆ పాటలన్నిటికీ సంగీతం సమకూర్చి రికార్డు చేయించి సీడీలా రూపొందించి.. ఆ పాటల ప్రోగ్రామ్ని లైవ్ మ్యూజిక్ నైట్ ఈవెంట్‌గా చేసి వచ్చిన డబ్బుతో తలసీమియా పిల్లలకు బ్లడ్ ప్యూరిఫై చేసే ఫిల్టర్స్ కొనిద్దాం అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
సీడీ రెడీ : అందరికీ ఈ పనిపట్ల ఆసక్తి ఉన్నా పాటలు రాయడానికి మాత్రం ముగ్గురే ముందుకు వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు మాలతి, ఇంకొకరు ఇమ్రాన్శాస్త్రి, మూడోవారు వినీల్. వీళ్లు రాసిన పదకొండు పాటలకు నయా పైస తీసుకోకుండా సంతోష్ కావలి అనే సినీ సంగీతదర్శకుడు స్వరాలు అందించారు. ఉచితంగా రికార్డ్ కూడా చేయించి ఇచ్చారు. రమ్యా బెహ్ర, అనఘా లాంటి వర్తమాన గాయనీగాయకులు ఈ గీతాలను ఆలపించారు. ఈ సీడీని ఏప్రిల్ 25న, హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఆవిష్కరిసు ్తన్నారు. దీంతోపాటు తలసీమియా మీద చైతన్యం కలిగించడానికి ఈ వ్యాధి బాధితుల మీద మా ఆసరా సంస్థ తీయించిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌నీ విడుదల చేస్తున్నారు.
ఈ రెండిటితోపాటు సీడీలో పాడిన గాయనీగాయకులతో లైవ్‌మ్యూజిక్ ప్రోగ్రామ్‌నూ నిర్వహిస్తున్నారు. దీనికి ఆరువందల రూపాయల టికెట్ పెట్టారు. ఈ టికెట్ కొనడమంటే తలసీమియా బాధితులకు కొనే ఫిల్టర్‌కోసం డొనేట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని తలసీమియా పిల్లలకు నాలుగు యూనిట్ల రక్తాన్ని శుద్ధిచేసే ల్యూకో డిప్లెషన్ ఫిల్టర్లు కొనివ్వడానికి వెచ్చిస్తున్నారు.
- సరస్వతి రమ