రామ్లా నేను ప్లేబాయ్ కాదు!
‘‘ఈ తరహా కథలు హిందీలో చాలా వచ్చాయి. ఇప్పుడు తెలుగులో ‘రామ్‌లీల’తో అలాంటి ప్రయత్నం చేయడం బాగుందని అందరూ అంటున్నారు. కథ కొత్తగా ఉందనే నేనీ సినిమా చేశా’’ అని హవీష్ అన్నారు. ఆయన హీరోగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘రామ్‌లీల’ గత శుక్రవారం విడుదలైన విషయం విదితమే. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిజిత్, నందిత తదితరులు నటించారు. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని హవీష్ అంటున్నారు. ఆయన చెప్పిన మరికొన్ని విశేషాలు...
‘జీనియస్’ తర్వాత చాలా కథలు విన్నాను. అన్నింటికన్నా ‘రామ్‌లీల’ కథ నచ్చింది. చూసినవాళ్లందరికీ కూడా నచ్చింది. ఒక మంచి మ్యూజికల్ మూవీ చూశామనే ఫీలింగ్‌ని చాలామంది వ్యక్తపరిచారు. నాకున్న ప్లస్ పాయింట్స్‌లో నా వాయిస్ ఒకటి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చేసిన రామ్ పాత్రకు నా వాయిస్ బాగా నప్పింది. నీ గొంతు బాగుంటుందనే కాంప్లిమెంట్ నా చిన్నప్పట్నుంచీ వింటున్నాను. రామ్ పాత్ర శారీరక భాష, నా శారీరక భాష ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను సునాయాసంగా చేయగలిగాను. కానీ, రామ్లా నేను ప్లేబోయ్ కాదండి.
రామ్ చాలా ఈజీగా అమ్మాయిలను పడేస్తాడు. నేనలాంటివాణ్ణి కాదు (నవ్వుతూ). ‘జీనియస్’ తర్వాత మళ్లీ దాసరి కిరణ్‌కుమార్‌గారి సంస్థలోనే సినిమా చేయడానికి కారణం ఆయన మీద ఉన్న నమ్మకమే. వేరే సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి కానీ, కథలు నచ్చక తిరస్కరించాను. ప్రేక్షకులు వినోదాన్ని ఇష్టపడుతున్నారు. అందుకని ఆ తరహా పాత్రలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. వినోద ప్రధానంగా సాగే కొత్త కథల అన్వేషణలో ఉన్నాను.