అందుకే సీక్వెల్ చేశా!
- దర్శకుడు సుందర్. సి
‘‘వాస్తవానికి ‘చంద్రకళ’కు సీక్వెల్ చేయాలనుకోలేదు. ఆ చిత్రంలో చివర్లో దెయ్యం బంగ్లాలో ఉన్నట్టు చూపించాను. దాంతో చాలామంది సీక్వెల్ చేస్తున్నారా? అని అడిగారు. అప్పుడు అనిపించింది... ఎందుకు సీక్వెల్ చేయకూడదు అని. మొదటి పార్ట్ కంటే భారీగా ఈ చిత్రం తీశాను. సక్సెస్ పరంగా కూడా తొలి భాగంకన్నా భారీగా ఉంటుంది’’ అని దర్శకుడు సుందర్.సి.
అన్నారు. సిద్ధార్ధ్, హన్సిక, త్రిష, పూనమ్ బజ్వా, సుందర్.సి ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ‘అరన్మణై 2’ చిత్రం తెలుగులో ‘కళావతి’గా విడుదల కానుంది. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సర్వాంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ ఈ చిత్రాన్ని అందిస్తున్నాయి. హిప్ హాప్ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించి, చిత్రదర్శకుడు సుందర్‌కి అందించారు.‘‘సుందర్‌గారి దర్వకత్వంలో ఇప్పటికే ఓ చిత్రం చేశాను. ప్రేక్షకులను ఎక్కడ భయపెట్టాలో, ఎక్కడ థ్రిల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు’’ అని సిద్ధార్ధ్ అన్నారు.
‘‘ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. జవ్వాజి రామాంజనేయులుగారి సహాయం మర్చిపోలేను. సుందర్‌గారు త్వరలో తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రం చేయాలని కోరు కుంటున్నా’’ అని నటి, సుందర్ సతీమణి ఖుష్బూ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్‌ను ఇప్పటివరకూ మూడు లక్షల యాభైవేల మంది చూడటం విశేషం’’ అని జవ్వాజి రామాంజనేయులు అన్నారు. ‘దిల్’ రాజు, మారుతి తదితరులు మాట్లాడారు.