నడకయాతన
సాక్షి, నల్లగొండ: వికలాంగుల సంక్షేమానికి సర్కారు నీళ్లొదులుతోంది. అన్నివిధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. ఫలితంగా వారు తీవ్ర నిర్లక్ష్యానికి గురై ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. జిల్లాలో సుమారు 85వేల మందికి పైగా వికలాంగులు ఉన్నారు. వీరిలో చాలామందికి ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు తదితర ఉపకరణాలు అవసరం. అయితే ఏటా కొంతమందికే సర్కారు వీటిని అందజేసి చేతులు దులుపుకుంటోంది. ఒకసారి అందజేస్తే ఆ పరికరాలు మూడేళ్ల వరకు ఉపయోగపడతాయి. వీటి జీవితకాలం పూర్తికాగానే మళ్లీ కొత్తవాటిని అందజేయాల్సి ఉంటుంది. ఇలా మూడేళ్లకోసారి ప్రతి వికలాంగుడికీ సంబంధిత పరికరం అప్పగించాల్సిందే. కానీ, ఇవేవీ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అత్తెసరుగా..
ప్రత్యేక అవసరాలు గల వారికి నామమాత్రంగా ఉపకరణాలు అందజేస్తున్నారు. దీంతో పరికరాల కోసం రెండేళ్లుగా వేలమంది వికలాంగులు నిరీక్షిస్తున్నారు. మొదటగా దరఖాస్తు చేసుకున్న, అధిక వికలత్వం ఉన్న వారికి తొందరగా ఉపకరణాలు ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 2012లో 700, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 ట్రై సైకిళ్లు మాత్రమే వికలాంగులకు అందజేశారు. గతేడాది జనవరి నుంచి ట్రె సైైకిళ్ల కోసం 500, ఊతకర్రల కోసం 200, కృత్రిమ అవయవాలకు 150, కాలిపర్స్కు 150మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వీరికి ఇప్పటివరకు పరికరాలు అందజేసిన పాపాన పోలేదు. ఇవేగాక తాజాగా రెవెన్యూ డివిజన్లలో అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో వెయ్యి మందికిపైగా వికలాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికే పరికరాలు చేరలేదు... తాజా దరఖాస్తుదారులకు ఎప్పుడు అందజేస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
తీవ్ర అవస్థలు..
పరికరాలు అందనివారిలో చాలామంది విద్యార్థులున్నారు. వీరు నిత్యం విద్యాలయలకు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకరు తోడుంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. బయట ఏ చిన్న అవసరం పడినా స్వయంగా చేసుకోలేని దుస్థితి దాపురించింది. వీరితోపాటు చిరువ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. వీరు పనిపై నిత్యం బయటకు వెళ్లాల్సిందే. దీంతో అటు బయట తిరగలేక.. ఇటు పరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారికి ఊతకర్రలూ ఇచ్చేందుకూ అధికారులకు మనసొప్పడం లేదు. ఊతకర్రల జత ధర రూ 750 నుంచి రూ 1000 వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించేందుకూ వారు సాహసించడం లేదు. దీన్నిబట్టి చూస్తే సర్కారుకు వికలాంగులపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోంది. వచ్చే గణతంత్ర దినోత్సవంనాడు పరికరాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, అప్పుడైనా వాటిని పూర్తిస్థాయిలో అందేజేస్తారా అన్న సందేహం కలుగుతోంది.