కదం తొక్కిన ఉపాధి కూలీలు
జఫర్గఢ్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరణల పేరుతో కుదించాలని చూస్తే మోడీ సర్కారుకు గోరికట్టడం ఖాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రంగయ్య హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది ఉపాధి కూలీలు, మేట్లు ఉపాధి పథకాన్ని కుదించొద్దని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం లోని స్థానిక రామాలయం నుంచి పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శన బుధవారం చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి మహాధర్నా నిర్వహించారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీహెచ్ రంగయ్య మాట్లాడుతూ దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహయ కార్యదర్శి రాపర్తి రాజు, ఆర్ సోమయ్య, కాట సుధాకర్, మర్రి రమేష్, గుండెబోయిన రాజు, శిరంశేట్టి రవి, సిద్దం లింగయ్య, ప్రభాకర్, టి.రమేష్, కుమార్, డి.సంపత్, యాకనాథం, శ్రీను, ఎల్లస్వామి, అనిల్, పిరోజ్ఖాన్, బల్లెపు రవి, రాంకుమార్తోపాటు ఆయా గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు, మహిళలు, మేట్లు వందలాదిగా పాల్గొన్నారు.