పగ్గాలు ఏ వర్గానికో?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై అధిష్టానం తలపట్టుకుంటోంది. జిల్లా పార్టీలో రెండు బలమైన సామాజికవర్గాల్లో ఒక వర్గానికి ఈ పదవిని కట్టబెట్టాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది. అది ఏ సామాజిక వర్గమనేది తేల్చుకోలేకపోతోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు పదవుల పంపిణీలో పాటించిన సమతూకాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని కేడర్ సూచిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుకు జిల్లాలో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వర్గం చాపకిందనీరులా పావులు కదుపుతోంది. ఆ వర్గం పార్టీ పగ్గాలు తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని నేతలు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, జడ్పీ చైర్పర్సన్ రెండు పదవులు కూడా ఒకే సామాజిక వర్గానికి, కోనసీమకు దక్కడంతో పార్టీ పగ్గాలు మెట్ట ప్రాంతానికే ఇవ్వాలనే మెలిక పెట్టినట్టుగా చెబుతున్నారు. ఒకవేళ అదే సామాజికవర్గానికే జిల్లా పగ్గాలు కూడా కట్టబెట్టాలనుకుంటే మెట్ట ప్రాంతానికే ప్రాతినిధ్యం కల్పించాలని ఆ వర్గం గట్టిగా పట్టుబడుతోంది.
ఈ ప్రయత్నాలన్నీ అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ఒకరిద్దరు బలమైన నేతలకు పగ్గాలు దక్కకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా యనమల వర్గం మెట్ట ప్రాంతానికి ఇవ్వాలనే ఎత్తులు వేస్తోందని కోనసీమ ప్రాంత నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ మొదటి నుంచి పార్టీలో వస్తోన్న సంప్రదాయాన్నే పాటించాలనుకుంటే అదే సామాజికవర్గం నుంచి మెట్ట ప్రాంతానికి చెందిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుకు ఇవ్వాలని ఇటీవల యనమల వర్గం చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం. పార్టీలో మొదటి నుంచీ పర్వత కుటుంబానికి ఉన్న అనుబంధం, మృదు స్వభావిగా ఉన్న పేరు వెరసి చిట్టిబాబు ప్రతిపాదన బాబు దృష్టికి తీసుకువెళ్లడంలో తెరవెనుక రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలకపాత్ర పోషించారంటున్నారు. చిట్టిబాబుకు పార్టీ పగ్గాలు అప్పగిస్త్తే జిల్లా పార్టీలో తమ ఆధిపత్యానికి ఢోకా ఉండదనేది ఆ వర్గం అభిప్రాయంగా కన్పిస్తోంది.
యనమల వర్గీయుల ఎత్తుగడను తిప్పికొట్టేందుకు వైరివర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీలో పరిణామాలు ఎలా మారినా యనమల హవాకు చెక్పెట్టాలనే ఏకైక అజెండాతో డెల్టాలో ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ పార్లమెంటరీ నాయకుడు హోదాతో కలిపి మూడు పదవులు కట్టబెట్టినప్పటికీ సంఖ్యాపరంగా ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అదే సామాజికవర్గానికి కోనసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలంటున్నారు. మెట్టకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే యనమల ఎత్తుగడను చిత్తుచేసే వ్యూహంలో భాగంగానే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నేతల డిమాండ్ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. దీనిలో భాగంగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల పేర్లు ప్రతిపాదనకు వచ్చాయని సమాచారం. వాస్తవానికి ఈ ప్రతిపాదన చర్చకు రావడంతోనే యనమల వ్యూహాత్మకంగా చిట్టిబాబు పేరును తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు.చిట్టిబాబుకు పగ్గాలు అప్పగించి పార్టీపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటోన్న యనమల పాచిక పారకుంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉందంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి, జడ్పీ చైర్పర్సన్, పార్టీ పార్లమెంటరీ నాయకుడు...ఇలా మూడు పదవులు ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టడం వల్ల బీసీ వర్గాలు దూరమవ్వకుండా ఉండాలంటే టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును యనమల వర్గం ప్రతిపాదిస్తోందని పార్టీ వర్గాల సమాచారం. మెట్టలో కాకుంటే డెల్టాలో అయినా తాము సూచించిన నేతకే పగ్గాలు దక్కాలనే వ్యూహంలో భాగంగానే సుబ్రహ్మణ్యం పేరు తెరపైకి తెస్తున్నారంటున్నారు. తాడేపల్లిగూడెం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ అమలు చేస్తే చాలనే భావనలో సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ వివాదంలోకి ఆయనను లాగవద్దని, అందరివాడుగా ఉండాలని ఆయన భావిస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ రకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి నియామకం వర్గాల మధ్య పోరుగా మారుతోంది. ఏదేమైనా ఈ అంశంపై స్పష్టత రావాలంటే మరో 15 రోజులు నిరీక్షించక తప్పేట్టు లేదు.