స్పెయిన్ కుర్రాళ్లకు పెళ్లి ఇష్టం లేదట !
పెళ్లి కాని ప్రసాదులు అంటే వినేవాళ్లకు కామెడీగా ఉండొచ్చు గాని పడేవాళ్లకే తెలుస్తాయి కష్టాలు అంటారు బాధితులు. యూరప్ దేశాల్లో ఒకటైన స్పెయిన్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. సహజంగానే ఆధునిక పోకడలు ఆ దేశాల్లో ఎక్కువ కాబట్టి ఇలా జరుగుతుందనుకునేరు.
యువకులు పెళ్లికి దూరంగా ఉండటానికి ప్రేరేపిస్తున్న కారణాలు వేరు. అక్కడ విడాకుల చట్టాలు చాలా కఠినంగా అమలవుతాయట. ఆ విడాకుల చట్టాల బాధ్యత పొసగని భార్యాభర్తలను వేరు చేయడం ఒక్కటే కాదు, తదనంతర పరిణామాల్లో విపరీతమైన జోక్యం ఉంటుంది. ఇద్దరూ విడిపోయాక జీవితాంతం జీవిత భాగస్వామిని ఏ లోటు రాకుండా పోషించాలి.
భర్త ఆదాయాన్ని బట్టి 15 నుంచి 40 శాతం వరకు భరణం ఇప్పిస్తారు. కొన్ని కేసుల్లో భర్త ఆర్థికంగా బలహీనుడైతే భార్య మంచి సంపాదన పరురాలైతే ఆమె నుంచే భర్తకు భరణం ఇప్పిస్తారు. అయితే, దీనికి ఒక కాలపరిమితి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఆస్తిపాస్తుల అంచనా అనంతరం ఈ విషయం నిర్ణయిస్తారు. అంతేకాదు, పిల్లలకు ఇద్దరూ కలిసుంటే వారు ఎంత ఆనందంగా బతుకుతారో విడిపోయాక కూడా అంతే ఆనందంగా బతికేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ యజమానిది అంటే భర్తది అని ఆ చట్టాలు చెబుతున్నాయి. ఆ పిల్లల పెంపకం బాధ్యతను పిల్లల ఆసక్తి మేరకే కాకుండా తల్లిదండ్రులు కాకుండా వారి ఇతర బంధువులు వారి పరిస్థితులు వంటివి పరిశీలించి కోర్టులు తమ విచక్షణతో తీర్పులు ఇస్తాయి. ఇలా ప్రతి విషయంలో చాలా కఠినతరమైన నిబంధనలు అమలు చేయడంతో జీవిత భాగస్వామి నుంచి పక్కన లేకుండా పోతుందన్న మాటే గాని మిగతా అన్నీ సేమ్ టు సేమ్. దీంతో ఈ పెళ్లీ వద్దు, తదనంతర కష్టాలు వద్దని అక్కడి పురుషులు భావిస్తున్నారు.
పెళ్లిళ్లు ఎంత తగ్గిపోయాయంటే పెళ్లిళ్లు చేసే వారికి ఆదాయం లేక రోడ్డున పడేంతగా తగ్గిపోయాయి. తాజాగా ఈ చట్టాలకు తోడు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కూడా మరో బలమైన కారణంగా కనిపిస్తోంది. అయితే, తాజాగా వారికి తోడు లేని లోటును ‘సహజీవనం’ భర్తీ చేస్తోంది! దానికి కూడా చట్టాలొస్తే ఏం చేస్తారో పాపం!!