పండగపూటా.. నలుగురిని నరికి చంపేశారు!
దీపావళి పండుగ రోజున తమిళనాడు రాజధానిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో నలుగురిని నరికి చంపేశారు. కన్నగి నగర్ ప్రాంతంలో పాత కక్షల కారణంగా జరిగిన ఘర్షణలో ముగ్గురిని నరికి చంపగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. వ్యాసర్పాడి జీవా రైల్వేస్టేషన్ సమీపంలో 29 ఏళ్ల రౌడీషీటర్‌ను అతడి ప్రత్యర్థులు నరికి చంపేశారు. కన్నగి నగర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులున్న గ్యాంగు.. నలుగురిపై దాడిచేసింది. పోలీసు స్టేషన్‌కు కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఈ దాడి జరిగింది. ఇందులో కాలియా రాజ్ అలియాస్ రంజిత్ కుమార్, సెబాస్టియన్ అలియాస్ మిల్లర్, శక్తివేల్ అక్కడికక్కడే మరణించారు. వాళ్లందరూ కన్నగి నగర్‌కు చెందినవారే. ఇదే దాడిలో గాయపడిన సెంగోటియన్ అనే యువకుడు మాత్రం రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంజాయి అమ్మే విషయంలో ఈ రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో జోబితా మణి అలియాస్ మణిమారన్, దాస్తా అలియాస్ తమిళ్ అరసన్, తిలానా అలియాస్ అరుపతరాజ్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇక వ్యాసర్పాడి ప్రాంతంలో జరిగిన గొడవలో బీవీ కాలనీకి చెందిన సి.పళని మరణించాడు. అదే ప్రాంతానికి చెందిన తొప్ప గణేశ్, అరివళగన్ అనే ఇద్దరు ఈ హత్యకు కుట్రపన్నారని పోలీసులు తెలిపారు. ఇది పాతకక్షలతో జరిగిన గొడవ అన్నారు. ఎవరో పిలిచారని చెప్పడంతో పళని రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగా, అతడిపై ప్రత్యర్థులు దాడిచేశారు. బీవీ కాలనీకి చెందిన ముత్తు బచ్చా హత్యకేసులో పళని నిందితుడు. 2014లో జరిగిన శరవణన్ అనే వ్యక్తి హత్యకేసులో కూడా ఇతడు అనుమానితుడు.