నిండు గర్భిణి ఇబ్బందులు
జనగామ: జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ఏడు గంటల పాటు నరకయాతన పడింది. తీరా డెలివరీ సమయానికి తమ నుంచి కాదని చేతులెత్తేశారు. గంటలో వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లాలని.. లేకుంటే పెద్ద ప్రాణానికే ముప్పు వాటిల్లుతోందని భయపెట్టారు. జనగామ జిల్లా పెద్దపహాడ్‌కి చెందిన కావ్య, హైదరాబాద్‌లోని అన్నోజీగూడకు చెందిన వల్లె శ్రీకాంత్ దంపతులు. ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో ఆమె తల్లిగారింటి వద్దనే ఉంటోంది. నిండు గర్భిణి అయిన కావ్యకు మంగళవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో మేనమామ మాధవరెడ్డి, బంధువులు ఆమెను జనగామ ప్రభు త్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మధ్యాహ్నం సమయంలో డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలో కావ్య పరిస్థితి బాగాలేదని, వెం టనే వరంగల్‌కు తరలించాలని డాక్టర్లు చెప్పి వెళ్లిపోయారు. ‘ బిడ్డరక్తం పోతోంది.. ప్రసూ తి చేయండి అంటూ కుటుంబసభ్యులు కాళ్లు, వేళ్తూ పట్టుకుని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. ‘పరిస్థితి విషమంగా ఉంది.. తర్వాత మీ ఇష్టం..’అని డ్యూటీలో ఉన్న వైద్యురాలు చెప్పడంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెం టనే అంబు లెన్స్‌లో వరంగల్‌కు తరలిస్తూ మార్గమధ్యం లో జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు 30 నిమిషాల్లోనే ఆపరేషన్ చేయగా కావ్య పండంటి కూతురుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.