కార్గో రవాణాకు ‘ఆన్లైన్’ దన్ను!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొనుగోలుదార్లను డిస్కౌంట్లతో ఆకర్షించడమే కాదు. వారు కొన్న వస్తువుల్ని వారికి భద్రంగా అందించటం కూడా కత్తిమీద సామే. అందుకే ఆన్లైన్ సంస్థలు ఇపుడు సరుకు రవాణా, కొరియర్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. దీంతో ఈ రెండు రంగాలూ ఒకదానికొకటి తోడవుతూ వేగంగా ఎదుగుతున్నాయి.
ఈ తీరుతెన్నులపై ప్రత్యేక కథనమిది...
దేశీయంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆర్డర్లను సకాలంలో కస్టమర్లకు చేర్చడమనేది దేశీ రిటైల్ సంస్థలకు సవాలుగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్డరు చేసిన 24 గంటల్లోగా ఇంటికి చేరవేస్తామంటూ ఆన్లైన్ సంస్థలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం సుమారు 2 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.12,500 కోట్లు) ఉంది.
ఇది 2023 నాటికి 56 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.3.5 లక్షల కోట్లకు)చేరుతుందని అంచనా. సరుకు రవాణా కంపెనీలకు ఈ రంగం నుంచి 2021 నాటికి 5 బిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ.31 వేల కోట్లు) వ్యాపారం రాగలదని అంచనా. వచ్చే ఏడాదిలో తమ కంపెనీ ద్వారానే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలకు రూ.250 కోట్ల మేర వ్యాపారం రావచ్చని ఆన్లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ చెబుతోంది. అందుకే ఈ అవకాశాలు అందుకోవటానికి సరుకు రవాణా సంస్థలూ గట్టిగా కసరత్తు చేస్తున్నాయి.
కొంగొత్త విధానాలు..
దిగ్గజాలతో పాటు డాట్‌జాట్, డెలివరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వంటి స్టార్టప్ లాజిస్టిక్స్ సంస్థలు ఆన్లైన్ రిటైల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా సర్వీసులను విస్తరిస్తున్నాయి. డాట్‌జాట్ ప్రత్యేకంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లు తమ ప్యాకేజీలను డెలివరీ తీసుకోవడంతో పాటు రిటర్న్ చేయాలన్నా ఈ కేంద్రాల్లో ఇచ్చేయొచ్చు. దేశీయంగా అతి పెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డీటీడీసీకి డాట్జాట్లో మెజార్టీ వాటా ఉంది.
డీటీడీసీకి దేశవ్యాప్తంగా 5,200 పైగా ప్రాంతాల్లో నెట్వర్క్ ఉంది. కలెక్షన్, డెలివరీ కోసం డాట్‌జాట్.. డీటీడీసీ నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించుకుంటోంది. రోజుకు 12,000 పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల దాకా ఆదాయం ఆర్జించనున్న డాట్‌జాట్ 2016 నాటికి రూ.100 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక ఢిల్లీవరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు.. వేలకొద్దీ పార్సిళ్లను వేరు చేసే మెషీన్లతో గిడ్డంగులను ఏర్పాటు చేసి, కస్టమర్ల ఇంటి వద్దే ఆల్టరేషన్ సేవలు కూడా అందించడానికి కసరత్తు చేస్తున్నాయి.
మారుమూల ప్రాంతాలకూ సత్వరం సేవలందించటంపై డాట్‌జాట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మల్టీ-యూజర్ గిడ్డంగులు ఏర్పాటు చేస్తోంది. విక్రేతల నుంచి ఆర్డర్లను పికప్ చేసుకుని, వాటి నిల్వ, ప్యాకింగ్ మొదలుకుని కస్టమరుకు రవాణా దాకా అన్ని సేవలూ అందించేందుకు డాట్‌జాట్ ప్రయత్నిస్తోంది. 59 నగరాల్లో సేవలందిస్తున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ .. భారీగా వచ్చే ఆర్డర్లను వేరు చేసేందుకు ఆటోమేషన్ విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. వీలైన సందర్భాల్లో ఆయా కంపెనీల ఆర్డర్లను ఆయా కంపెనీల యూనిఫాంలలోనే డెలివరీ బాయ్స్ అందించేలా చూస్తోంది.
కాగా, ఆల్టరేషన్ సేవలు కూడా అందించేందుకు బెంగళూరుకు చెందిన ఒక ఫ్యాషన్ పోర్టల్‌తో చర్చలు జరుపుతోంది. దీని ప్రకారం సదరు డ్రెస్‌ను అందించిన తర్వాత కస్టమర్ దాన్ని ట్రయల్ చేసి చూసేదాకా డెలివరీ బాయ్ వేచి ఉంటాడు. ఒకవేళ కొలతల్లో ఏవైనా తేడాలుంటే.. స్వయంగా ప్రి-అప్రూవ్డ్ టైలర్ దగ్గరకు డ్రెస్‌ను తీసుకెళ్లి మార్పులు చేయించి కస్టమర్‌కి తిరిగి అందిస్తాడు. లాజిస్టిక్స్ దిగ్గజాల్లో ఒకటైన బ్లూడార్ట్ మాజీ ఉద్యోగులు ‘ఈకామ్ ఎక్స్‌ప్రెస్’ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్లో 1,300 మంది ఉద్యోగులుండగా... కొద్ది రోజుల్లో మరో 50 నగరాలకు సేవలు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
పటిష్టమైన వ్యవ స్థ..
ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ లావాదేవీల్లో సింహభాగం (సుమారు 60%) క్యాష్ ఆన్ డెలివరీదే(ఆర్డరు చేతికి వచ్చాక నగదు చెల్లింపు) ఉంటోంది. ఇలాంటి లావాదేవీల్లో తప్పులు జరగకుండా చూసుకునేలా ఐటీ వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఢిల్లీవరీ వర్గాలు తెలిపాయి. బ్యాంకులతో కూడా కలసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2011లో ఏర్పాటైన ఢిల్లీవరీ ప్రస్తుతం 130 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. కంపెనీలో 3వేల పైచిలుకు ఉద్యోగులుండగా.. రోజుకు 50,000 పైగా ఆర్డర్లను చేరవేస్తోంది. అటు బ్లూడార్ట్, అరామెక్స్ వంటి భారీ సంస్థలు కూడా ఈకామర్స్ సైట్ల అవసరాల గురించి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాయి.