ఈసీఈ ఎవర్గ్రీన్ బ్రాంచ్
బాలాజీచెరువు(కాకినాడ): ఇంజినీరింగ్ కోర్సులలో ఈసీఈ బ్రాంచ్ ఎవర్గ్రీన్ అని, దానికున్న ప్రాముఖ్యం ఎనలేనిదని జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో మంగళవారం ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ వీఏఎస్‌ఐ టెక్నాలజీ డిజైన్ యూజింగ్ ఈడీఏ టూల్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరిగే జాతీయవర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ కుమార్ మాట్లాడుతూ ఈసీఈ బ్రాంచ్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, దీనిలో ముఖ్యంగా వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు వీటిలో పరిశోధనలు చేసి వ్యవస్థాపకులుగా ఎదగాలని సూచించారు. కోరల్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ బి.కె.దేవయ్య మాట్లాడుతూ దేశ రక్షణలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, అందువల్ల పరిశోధనపై దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.రామచంద్రరాజు మాట్లాడుతూ చర్చాగోష్టిలో పొందిన విషయ పరిజ్ఞానాన్ని ప్రయోగ పద్ధతుల్లో విద్యార్థులకు నేర్పించగలిగితే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐఎస్టీ డైరక్టర్ కె.సత్యప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ పద్మప్రియ, పి.పుష్పలత, ఝాన్సీరాణి పాల్గొన్నారు.