ట్రాన్స్ విమెన్కి రికార్డు స్థాయిలో రూ. 6 లక్షల నష్టపరిహారం..!
ట్రాన్స్జెండర్లు హక్కులను గౌరవించమని, తాము మనుషులమే అని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు, పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు సైతం వాళ్లకు కూడా కొన్ని హక్కులను ప్రసాదించింది. వారికి సమాజంలో సుమచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది కూడా. కానీ ఎక్కడో ఒక చోట వారిపై దాడులు, లింగ వివక్షత వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. చెప్పాలంటే వారి విషయంలో సమాజం తీరు చాలావరకు మారాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి వివిధ దేశాల్లో కూడా ఉండటం బాధకరం. కొన్ని దేశాలు వారిపట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తాయి. కనీసం వారి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి ఓ దేశం ఓ ట్రాన్స్ విమెన్ కేసుకి ప్రాధాన్యత ఇవ్వడమే సత్వరమే ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. ఈ ఘటనను చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుందంటే..చైనాకు చెందిన ట్రాన్స్ విమెన్ మగవాడిగా జన్మించి.. స్త్రీగా మారింది. ఇలా ట్రాన్సవిమెన్గా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఆమెను కిన్హువాంగ్డావో సిటీ ఫిఫ్త్ అనే మెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఏదో మానసిక సమస్య వల్ల ఇలా చేసిందంటూ ఇదివరకటి వ్యక్తిలీ మార్చేలా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ నుంచి ఆమెకు మొదలైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిబ్బందితో సహా వైద్యులంతా తన ధోరణిని తప్పుపడుతూ బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవ్వరూ ఆమెను విభిన్న లింగానికి చెందినదిగా అంగీకరించపోగా, హేళనలు, చిత్కారాలతో ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిమిత్తమైన సుమారు 97 రోజుల పాటు ఏడు సెషన్ల ఎలక్ట్రోషాక్ థెరపీ అందించారు. దీని కారణంగా మూర్చ(ఫిట్స్) వంటి సమస్యలు వచ్చాయి. ఆ ఆస్పత్రి బయట సమాజం అంగీకరించే విధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా వైద్యం చేశారు. దీని కారణంగా అనారోగ్యం పాలయ్యానంటూ కోర్టుని ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్లకి ప్రాధాన్యత ఇవ్వని చైనా దేశం ఆమె కేసుని టేకప్ చేయడమే కాకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. చైనా మెంటల్ హెల్త్ చట్టాల ప్రకారం..వ్యక్తి ఇష్టానికి లోబడే చికిత్స చేయాలి. అలా కాకుండా వారి ఇష్టంతో సంబంధం లేకుండా ప్రమాదం కలిగించేలా చికిత్స చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది చైనా కోర్టు. ఈ మేరకు చాంగ్లీ కౌంటీ పీపుల్స్ కోర్ట్ స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ వ్యక్తులను "మార్చడానికి" హానికరమైన మందులు లేదా ఎలక్ట్రోషాక్ పద్ధతులను ఉపయోగించడం నేరం అని స్పష్టం చేసింది. ఆమెను అనారోగ్యం పాలు చేసినందుకు గానూ సదరు హాస్పిటల్ దాదాపు రూ. 6 లక్షలు పైనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పేర్కొంది. (చదవండి: ఫ్యాషన్కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..)