కృష్ణగిరిలో గజరాజుల బీభత్సం
చిత్తూరు జిల్లా (కుప్పం): తోటివారికి ఏమైనా అయితే మనుషులు స్పందిస్తారో లేదోగాని జంతువులు మాత్రం స్పందిస్తాయని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగుల గుంపు నిరూపించాయి. చిత్తూరు జిల్లా కృష్ణగిరి-హోసూరు జాతీయ రహదారిపై సహచర ఏనుగు మృతితో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దాదాపు 40 ఏనుగులు గుంపుగా వచ్చి రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. అందులోని ఓ ఏనుగు అక్కడిక్కడే మృతి చెందింది. ఇది చూసిన ఏనుగులు ఆవేశంతో ఊగిపోయాయి. ఘీంకారాలు చేస్తూ కారుపై దాడి చేశాయి.
కారును నుజ్జు నుజ్జు చేశాయి. అందులోని ప్రయాణికులను చంపేందుకూ ప్రయత్నించాయి. వారు అతి కష్టం మీద కారు నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏనుగుల దాడి సంఘటనతో జాతీయ రహదారిపై దాదాపు నాలుగు గంటలపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.గతంలో కూడా కరెంట్ తీగ తగిలి గజరాజు మృతి చెందిన సంఘటనలో కూడా గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులకు ఆహారం, నీళ్లు లేకనే అడవినుంచి జనారణ్యంలోకి ఏనుగులు గుంపులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.