కొత్త దిక్సూచి ‘నీతి ఆయోగ్’
ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు
కేంద్ర, రాష్ట్రాల విధానాలకు ఇకపై రూపకర్త
కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
కేబినెట్ తీర్మానంలో విధివిధానాలు, లక్ష్యాల వెల్లడి
న్యూఢిల్లీ: ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను కేంద్రం తీసుకొచ్చింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(ఎన్ఐటీఐ)’ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ఇకపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలను రూపొందించే మేధో సంస్థగా సేవలందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తారు.
ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ కేంద్ర, రాష్ట్రాలకు ఒకే జాతీయ ఎజెండాను ఖరారు చేయడమే ఈ మండలి లక్ష్యం. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ‘గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం వల్ల రాష్ట్రాలను సంప్రదించడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు.
ఇప్పుడు ‘నీతి ఆయోగ్’ అదే పని చేస్తుంది. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి ఫలాలను పొందాలి. మెరుగైన జీవితాన్ని అనుభవించాలి. సాధికారత, సమానత్వమే లక్ష్యంగా ప్రజానుకూల, గతిశీల, సమ్మిళిత అభివృద్ధి ఎజెండాను అమలు చేసేందుకే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశాం. అన్నిటికీ ఒకే మంత్రం పటించే మూస ధోరణికి ఇక వీడ్కోలు పలుకుదాం. దేశ భిన్నత్వం, బహుళత్వాన్ని ఈ కొత్త సంస్థ ప్రతిబింబిస్తుంది.
దేశాభివృద్ధి పథంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మారిన ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ అవసరమని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ పేర్కొనడం తెలిసిందే. ప్రధాని నిర్ణయం మేరకే రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుని కేబినెట్ తీర్మానం ద్వారా ‘నీతి ఆయోగ్’ను కేంద్రం ఏర్పాటు చేసింది.
తొలి వైస్‌చైర్మన్‌గా అరవింద్ పనగారియా!
‘నీతి ఆయోగ్’కు సీఈవో, వైస్ చైర్పర్సన్లను ప్రధాని నియమిస్తారు. సంస్థ తొలి వైస్‌చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియా నియమితులు కానున్నట్లు సమాచారం. కాగా, ఈ సంస్థలో ఐదుగురు శాశ్వత సభ్యులతో పాటు ప్రముఖ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలకు చెందిన ఇద్దరు తాత్కాలిక సభ్యులు కూడా నియమితులవుతారు. నలుగురు కేంద్ర మంత్రులు ఎక్స్అఫీషియో సభ్యులుగా సేవలందిస్తారు. పలు రంగాలకు చెందిన మేధావులు, నిపుణులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధాని నామినేట్ చేస్తారు. అలాగే నీతి ఆయోగ్‌కు అనుబంధంగా ప్రత్యేక ప్రాంతీయ మండళ్లను ఆ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇవి పలు రాష్ట్రాలు లేదా ప్రాంతాలపై దృష్టి సారిస్తాయి. వీటిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతీయ మండళ్లకు నీతి ఆయోగ్ చైర్‌పర్సనే నేతృత్వం వహిస్తారు.
కేంద్ర, రాష్ట్రాలకు దిశానిర్దేశం
ఆర్థిక సమస్యలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ‘నీతి ఆయోగ్’ సహకరిస్తుందని కేంద్రం తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తగిన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను ఇస్తుందని వెల్లడించింది. ఈ సంస్థ విధివిధానాలు, లక్ష్యాలను కూడా కేబినెట్ తీర్మానంలో పొందుపరిచింది. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, స్వామీ వివేకానంద, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి మహానేతల స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావిస్తూ ఈ తీర్మానాన్ని కేంద్రం రూపొందించింది. మారిన ఆర్థిక పరిస్థితులు, ఆహార భద్రతావసరాలు, గ్లోబలైజేషన్, కొత్త టెక్నాలజీలు, పారదర్శకత, మేధో సంపత్తి వినియోగం వంటి అనేక శక్తుల ప్రభావంతో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో వివరించింది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వాలకు వ్యూహాత్మక సూచనలు చేయడం వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రాలకు చురుకైన పాత్ర కల్పిస్తూ జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం, గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయడం, పేదల అభ్యున్నతికి దీర్ఘకాలిక విధానాలను రూపొందించడం వంటివి కొత్త వ్యవస్థ విధులుగా పేర్కొంది. అభివృద్ధి ఎజెండా అమలులో భాగంగా తలెత్తే సమస్యలను పరిష్కరించే వేదికగా కూడా ఇది పనిచేయనుంది. సుపరిపాలనా విధానాలపై అధ్యయనం చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును పరిశీలిస్తూ జాతీయ అభివృద్ధి ఎజెండాను ‘నీతి ఆయోగ్’ అమలు చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర జాతీయ, అంతర్జాతీయ మేథో సంస్థలతోనూ నిరంతర సంప్రదింపులు జరుపుతుందని పేర్కొంది.