‘మట్టి’ కోసం గట్టి యత్నం
పర్యావరణమే రత్నమ్మ అభిమతం
65 సంవత్సరాలుగా మట్టి విగ్రహాల తయారీ
మట్టి గణపతుల వాడకంపై విస్తృత ప్రచారం
ప్రతియేట ఉచితంగా శిక్షణ
సిద్దిపేట జోన్: పర్యావరణ పరిరక్షణ.. నేడు ప్రతి నోట వినిపిస్తున్న మాట. వినాయక చవితి పండుగ సమయంలో మట్టి గణపతి ప్రతిమల వాడకం మంచిదన్న పదం మూడు సంవత్సరాలుగా జోరందుకుంది. మరోవైపు పర్యావరణ ప్రేమికులు.. విగ్రహాలను ప్రకృతి సిద్ధమైన మట్టి ద్వారానే చేయాలని కోరుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి రసాయనిక పదార్థాలతో జల, వాయు కాలుష్యమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల వైపు మొగ్గు చూపుతున్నారు.
65 సంవత్సరాల క్రితమే
ఈ చైతన్య స్ఫూర్తికి సరిగ్గా 65 సంవత్సరాల క్రితమే సిద్దిపేటలో శానంగారి రత్నమ్మ శ్రీకారం చుట్టారు. ఓనమాలు కూడా తెలియని రత్నమ్మ తన భర్త చూపిన మార్గాన్ని ఎంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మట్టి వినాయక విగ్రహాలను పట్టణంలో తొలిసారి తయారు చేసి అదే నేటికి జీవనోపాధిగా, పలువురుకి స్ఫూర్తి దాయకంగా నిలిచిన రత్నమ్మ అభిమాతం ప్రజాహితం. ఎనమిది పదుల వయస్సులోనూ పర్యావరణ పరిరక్షణకు తపన పడుతోంది. ఎన్నో ఏళ్లుగా మట్టి వినాయక విగ్రహాల తయారీని జీవనోపాధిగా మల్చుకున్నారు.
శిక్షణ కార్యక్రమాలు
కొన్ని సంవత్సరాలుగా మట్టి విగ్రహాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రజల్లో నెలకొన్న ఆసక్తికి అనుగుణంగానే తన అకాంక్షను మరింత పట్టిష్టం చేశారు రత్నమ్మ. అందులో భాగంగానే విద్యాసంస్థల్లో, ప్రైవేట్ కళాశాలల్లో, స్వచ్ఛంద సంస్థల్లో ప్రతియేడు శిక్షణ కార్యక్రమాన్ని సొంతంగా నిర్వహిస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ విధానం గూర్చి అవగాహన కల్పిస్తూనే పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని యువతకు పిలుపునిస్తున్నారు.
నాడు తండ్రితో.. నేడు భర్తతో..
చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన వెగ్గలం విశ్వనాథం మట్టి విగ్రహాలను తయారు చేసేవారు. చిన్ననాటి నుంచి తండ్రి విశ్వనాథం చేస్తున్న విగ్రహాల తయారీపై రత్నమ్మ ఆసక్తిని పెంచుకోవడమేకాక, నేర్చుకున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన శానంగారి బ్రహ్మయ్యచారితో వివాహం జరగడం..
భర్త కూడా మట్టి విగ్రహాలను తయారు చేస్తుండటంతో ప్రతియేటా భార్యభర్తలు చిన్నచిన్న విగ్రహాలను తయారు చేసి విక్రయించే వారు. అప్పట్లో కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేసే వారు. ఈ క్రమంలోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే విగ్రహాల వల్ల జల, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్న పర్యావరణ ప్రేమికుల చైతన్యానికి ప్రజలు మట్టి విగ్రహాల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు.
పెరుగుతున్న చైతన్యం
మూడు సంవత్సరాలుగా పట్టణంలో చైతన్యం పెరుగుతోంది. ఇప్పుడు వచ్చిన చైతన్యానికి సరిగ్గా 65 సంవత్సరాల కిత్రం శానంగారి కుటుంబం బీజం నాటిందనే చెప్పాలి. ప్రస్తుతం రత్నమ్మ వయస్సు 87 సంవత్సరాలు. ఆరోగ్యం సహకరించనప్పటికీ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పండుగ ముందు రోజు వందలాది ప్రతిమలను తయారు చేయడం ఆమె ప్రత్యేకత.
కొన్ని సంవత్సరాలుగా కుటుంబీకుల సహకారంతో మట్టి వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులుకు ఉచితంగా అందజేస్తున్నారు. విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు రత్నమ్మను అభినందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచారంటూ కొనియాడుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఆమె.. వందలాది శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా మట్టి విగ్రహాలను తయారు చేయడం నేర్పిస్తున్నారు.
తయారీ ఇలా..
చెరువు నుంచి తీసిన నల్లరేగడి మట్టిని తడిపెడుతూ బాగా ముద్దగా తయారు చేస్తారు. మట్టి ముద్దలను కర్రతో చేసిన అచ్చులతో అందమైన వినాయక విగ్రహాలుగా తీర్చిదిద్దుతారు. ఇలా తయారు చేసిన విగ్రహాలకు వాటర్ కలర్స్ వేస్తారు. సంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజు ప్రకృతి సిద్ధంగా లభించే మట్టితో చేసిన వినాయకుడికి పూజలు చేయడం శ్రేష్టమన్న సంస్కృతికి సమాజం మొగ్గు చూపుతున్నారు.ఈ సంప్రదాయానికే జైకొట్టడం వెనుక రత్నమ్మలాంటి పర్యావరణ ప్రేమికుల కృషి ఉందనే చెప్పాలి.