బండ బడ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నూతన సంవత్సర కానుకగా గ్యాస్ వినియోగదారులపై ప్రభుత్వం భారం మోపింది. డిసెంబర్ మొదటి వారంలోనే గ్యాస్ ధరను పెంచిన సర్కారు నెల రోజులు గడవక ముందే మరోసారి దాని ధరను గణనీయంగా పెంచింది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు,బస్సుచార్జీలు పెరగడంతో విలవిల్లాడుతున్న సామాన్య జనంపై సర్కారు తాజాగా గ్యాస్ ధరనూ పెంచి వడ్డించి వారి నడ్డి విరిచింది. కొద్దిరోజుల క్రితం సిలిండర్‌పై రూ.50 వరకూ పెంచి ఏడాదిలో 6సిలిండర్లు దాటి వినియోగిస్తే సబ్సిడీ వర్తించదని కేంద్రం ప్రకటించిన సందర్భంలో ప్రజావ్యతిరేకత రావడంతో దాన్ని 9కి పెంచారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ సిలిండర్ ధరను పెంచింది. పెరిగిన గ్యాస్ ధర జనవరి1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో సర్వత్రా ప్రజలు మండి పడుతున్నారు. సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.230,కమర్షియల్ సిలిండర్‌పై రూ.411 పెరిగిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.