శిక్షణతో శక్తిమంతం
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చిలకలపూడి) : యువతను శక్తిమంతులను చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న జాబ్ మేళా-2016కు ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను ఆదివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్యతపై శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ పదవులను త్యాగం చేసైనా సరే బందరు పోర్టును తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ యువతలో నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ త్వరలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ బాలురు, బాలికల ఆటల పోటీలు నిర్వహించనున్నామని వివరించారు.
విద్యార్థులు వీఎన్వీ భవానీ, ఎస్. రామయ్య, మౌనిక మాట్లాడుతూ శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, యూనివర్సిటీ రిజిష్ట్రార్ డి. సూర్యచంద్రరావు, క్యాంపస్ ప్రిన్సిపాల్ వైకే సుందరకృష్ణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ డి. రామశేఖరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చంద్రన్న జాబ్ మేళాలో ఎంపికైన 214 మంది విద్యార్ధులకు మంత్రి చేతల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.