రాజుకుంటున్న రగడ
ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజు అదనపు బాధ్యతలు నిర్వహించిన చోట వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ఈ క్రమంలో గతంలో జరిగిన బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ సస్పెన్షన్ వ్యవహారం మరో రగడకు దారితీసింది. ఏసీబీ తనిఖీలు, ఇతరత్రా ఆరోపణల వెనక తాను చేసిన సస్పెన్షన్ వ్యవహారమే కారణమని ఇన్చార్జి అధికారి రాజు వాపోతుండగా, తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, ఇన్చార్జి అధికారి నిర్లక్ష్యానికి తాను బలి పశువునయ్యాయని, కోర్టు ఉత్తర్వులతో విధుల్లో చేరినా జీతం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇన్చార్జి అధికారిపై సూపరింటెండెంట్ ప్రతి దాడికి దిగారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
గజపతినగరం తహశీల్దార్ కార్యాలయంలో చైన్మన్గా పనిచేసి చనిపోయిన పున్నాన అప్పారావు రెండో భార్య గంగాధర లక్ష్మికి ఎస్టీ కులధ్రువీకరణ నిర్ధారణ చేసుకుని కారుణ్య నియామకం కింద హాస్టల్ కుక్ పోస్టింగ్ ఇవ్వాలని బీసీ వెల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్ రాజును గత ఏడాది ఆగస్టు 10న కలెక్టర్ ఆదేశించారు. దీంతో బీసీ వెల్ఫేర్ కార్యాలయ వర్గాలు అదే నెల 22వ తేదీన కుల నిర్ధారణ కోసం ఆర్డీవోను లేఖ ద్వారా కోరారు. దానిపై విచారణ జరిపిన ఆర్డీఓ కుల ధ్రువీకరణను నిర్ధారిస్తూ సెప్టెంబర్ 8న రిజిస్టర్ పోస్టులో నివేదిక పంపించారు. దానిపై సెప్టెంబర్ 11న ఇన్చార్జి అధికారి రాజు మార్జినల్ రిమార్క్స్ రాశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా గంగాధర లక్ష్మికి పోస్టింగ్ విషయంలో జాప్యం జరిగింది. ఈ విషయమై లక్ష్మి అనేక పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారి సంతకం పెట్టాకే పోస్టింగ్ ఇవ్వగలమని సూపరింటెండెంట్ చెబుతూ వచ్చారు. చివరికి లక్ష్మి గ్రీవెన్సెల్కెళ్లి కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని జాప్యానికి గల కారణాలపై ఇన్చార్జి అధికారి రాజును వివరణ కోరారు.
సూపరింటెండెంట్‌కు షోకాజ్
కలెక్టర్ ఏ రోజైతే వివరణ కోరారో అదే రోజున గంగాధర లక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఫైలుపై అధికారి రాజు సంతకం పెట్టి ఉత్తర్వులిచ్చేశారు. అయితే కలెక్టర్ మాత్రం జాప్యానికి గల కారణాలేంటి? బాధ్యులెవరో చెప్పాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్ తవుడు బాబుకు అక్టోబర్ 5న షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీంతో తవుడు బాబు వివరణ ఇచ్చారు. అయితే, కార్యాలయం నుంచి కలెక్టర్‌కు వెళ్లిన నివేదిక తవుడుబాబు సంజాయిషీకి భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో తవుడు బాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చేశారు.
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సూపరింటెండెంట్
తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ సూపరింటెండెంట్ తవుడు బాబు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అన్నీ పరిశీలించాక కలెక్టర్ ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడమే కాకుండా వెంటనే అదే పోస్టులో చేర్చుకోవాలని అటు మధ్యంతర ఉత్తర్వులను ట్రిబ్యునల్ ఇచ్చింది. దీంతో తవుడు బాబు విధుల్లో చేరారు. కానీ, అప్పటి నుంచి జీతం మాత్రం ఇవ్వడం లేదు. ఇంత అన్యాయం చేసిన ఇన్చార్జి అధికారి రాజు తానేదో ఏసీబీ వద్దకెళ్లానని చెబుతూ తిరగడం సరికాదని తవుడుబాబు వాపోతుండగా, అ సస్పెన్షన్లే తనపై ఆరోపణలు రావడానికి కారణమని అధికారి రాజు చెబుతుండడంతో నివురు గప్పినా నిప్పులా బీసీ వెల్ఫేర్‌లో ప్రస్తుతం వివాదం రాజుకుంది.