బాధిత కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబసభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ పీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి..వాటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు నాయకన్‌గూడెం ప్రజలు బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడటం కోసం చేసిన కృషి మరవలేనిదన్నారు. ఇక్కడి వైద్య సిబ్బంది, పోలీస్, ఇతర అధికారులు సంఘటన జరగగానే స్పందించిన తీరు ప్రశంసనీయమన్నారు. హాంమంత్రి వెంట తూర్పుగోదావరి జిల్లా డీఐజీ రామకృష్ణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు. కాగా బస్సు ప్రమాదంలో పదిమంది దుర్మరణం చెందగా, మరో 18మంది గాయపడిన విషయం తెలిసిందే.