అప్పుడు చంద్రకళ.. ఇప్పుడు నివేదిత!
అప్పట్లో రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను నడిబజారులో నిలదీసి ఐఏఎస్ అధికారిణి చంద్రకళ శెభాష్ అనిపించుకోగా.. తాజాగా మరో ఐఏఎస్ అధికారిణి ఓ లంచగొండికి చుక్కలు చూపెట్టింది. నకిలీ బిల్లులు పెట్టి సర్కారు సొమ్మును బుక్కాలని చూసిన ఓ పంచాయతీ కార్యదర్శిని పబ్లిగ్గా గుంజీలు తీయించింది మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి నిధి నివేదిత. సింగరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మించిన బహిరంగ మూత్రశాలల బయట వాష్ బేసిన్స్, ట్యాపులు ఏర్పాటుచేయించినట్టు.. మార్ఫింగ్ ఫొటోలతో బిల్లులు పంపించాడు పంచాయతీ కార్యదర్శి.
దీనిని పరిశీలించేందుకు ఐఏఎస్ అధికారిణి నివేదిత ఇటీవల ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ వాష్ బేసిన్లు, ట్యాపులు లేకపోవడంతో ఇదేమిటని నిలదీశారు. దీంతో తాము ఫొటోషాపింగ్ చేసిన ఫొటోలతో బిల్లులు సమర్పించామని అతడు నిజాన్ని ఒప్పుకున్నాడు. అవినీతి చర్యలకు పాల్పడిన అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఏఎస్ నివేదిత.. అతన్నితో అక్కడే గుంజీలు తీయించింది. అవినీతికి పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో కలెక్టర్‌గా పనిచేస్తున్న తెలంగాణ బిడ్డ చంద్రకళ గతంలో అవినీతి అధికారులపై ఇలాగే ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే.