సాహిత్య సౌరభం..
భాగ్యనగరం మరోసారి సాహిత్య శోభను సంతరించుకోనుంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు ఇందులో భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని చెబుతున్నారు ఫెస్టివల్ నిర్వాహకులు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఈ వేడుక వివరాలను ఫెస్టివల్ డెరైక్టర్స్ అజయ్ గాంధీ, అమితా దేశాయ్, జీఎస్పీ రావ్, టి.విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు.
మూడు రోజులు జరిగే ఈవెంట్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు, స్క్రీనింగ్స్, ప్రసంగాలు ఇలా 70కి పైగా కార్యక్రమాలు నగరవాసులను అలరించనున్నాయి. భాషకు సంబంధించిన అనేక అంశాలకు ఈ ఫెస్టివల్ వేదికగా మారనుంది. ఈ పండుగలో దేశంలోని ప్రముఖ రచయితలు, యాక్టివిస్ట్‌లు, కళాకారులు తదితరులు పాల్గొననున్నారు. చదివే అలవాటును ప్రమోట్ చేయడమే దీని ప్రదానోద్దేశం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఫీజు లేదని, అందరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి జావేద్ అక్తర్ హాజరుకానున్నారు. ఉర్దూ కవి సాహిర్ లుధియాన్వీకి ట్రిబ్యూట్‌గా ‘పర్చాయియన్’ అనే నాటకాన్ని 24న ప్రదర్శించనున్నారు. మహేష్‌భట్, అరుణ్‌శౌరి, మంగళాభట్, కల్పన తదిరతర ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
బెస్ట్ ఈవెంట్..
‘2014లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ప్రపంచంలో సెకెండ్ బెస్ట్ విజిటింగ్ ప్లేస్‌గా హైదరాబాద్‌ని పేర్కొంది. ఆ లింక్‌లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ గురించి ప్రముఖంగా పేర్కొంది. అంతేకాదు దేశంలో జరిగే ఆరు అతిపెద్ద లిటరరీ ఫెస్టివల్స్‌లో ఇదీ ఒకటి’ అని తెలిపారు హెచ్ఎల్ఎఫ్ డెరైక్టర్ జీఎస్పీ రావ్. ‘ఐదేళ్లుగా ఏటా డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పర్మినెంట్ వెన్యూ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాల’ని కోరారు మరో డెరైక్టర్ అజయ్ గాంధీ.
- ఓ మధు