వైఎస్ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేపట్టండి
తెలుగు ప్రజలకు, పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ పిలుపు
రేపు వైఎస్ ఐదవ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతి (సెప్టెంబర్ 2)ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా రూపకల్పన చేసి అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ, సామాజిక, మహిళా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజులు చెల్లింపు వంటివి విప్లవాత్మకమైనవని గుర్తుచేశారు. రెండోసారి ఎన్నికై సీఎంగా పగ్గాలు చేపట్టాక వైఎస్ దురదృష్టవశాత్తూ మరణించారని, ఆయన జీవించి ఉంటే రాష్ట్రానికీ గతి పట్టి ఉండేది కాదని, తెలుగు ప్రజలు విడిపోయి ఉండేవారు కాదని మైసూరా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న ఆయన విగ్రహాలకు రెండు రాష్ట్రాల్లోనూ నివాళులర్పించడంతోపాటుగా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రక్తదాన శిబిరాలు, పేదలకు సాయం చేయడం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.