గోటి పూసలు... మేటి సొగసులు
నెయిల్ ఆర్ట్
ఇది ఫిష్ ఎగ్ నెయిల్ ఆర్ట్.. గోళ్లను ఎప్పుడూ నెయిల్ పాలిష్లతోనే అలంకరించుకునే కంటే దానికి ఇంకేవైనా మెరుగులు దిద్దితే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది. అందుకే ఈసారి మీ గోళ్లకు ఫిష్ ఎగ్స్ (చేప గుడ్లు) అతికించండి. అదేమిటి..! ఇప్పుడు ఆ చేప గుడ్ల కోసం సముద్రం వరకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా..? అంత దూరం వద్దులెండి.. ఒరిజినల్ చేప గుడ్లు కాదు కానీ, వాటిలాగే ఉండే రంగురంగుల మినీ బీడ్స్ ప్రస్తుతం షాపుల్లో దొరుకుతున్నాయి.
ఈ ఫిష్ ఎగ్ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి గులాబి రంగు నెయిల్ పాలిష్, గులాబి రంగు మినీ బీడ్స్ ఉంటే చాలు. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిజైన్‌ను వేసుకోండి. ఎలా అంటే...
1.ముందుగా గోళ్లన్నిటికీ పూర్తిగా గులాబి రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా చుట్టుపక్కలకు ఏమైనా పాలిష్ అంటుకుంటే రిమూవర్‌తో తుడిచేసుకోండి.
2.ఇప్పుడు గులాబి రంగు మినీ బీడ్స్‌ను సిద్ధం చేసుకోవాలి. షైనింగ్‌గా ఉండే బీడ్స్‌ను ఎంచుకుంటే గోళ్లు అందంగా కనిపిస్తాయి.
3.నెయిల్ పాలిష్ వేసుకున్న గోళ్లను బీడ్స్ డబ్బాలో ఓసారి ముంచి తీసేయాలి. అప్పుడు అవి గోళ్లకు అతుక్కుంటాయి.
(నెయిల్ పాలిష్ ఆరక ముందే బీడ్స్‌ను అతికించాలి).
4.ఈ మినీ బీడ్స్ ఇప్పుడు మీ గోళ్లకు ఫొటోలో కనిపిస్తున్నట్లుగా అతుక్కుంటాయి. అలా ఒక్కొక్క గోరుకు బీడ్స్‌ను అతికించుకుంటూ పోవాలి. (గులాబి రంగుకు బదులుగా వేరే ఏ రంగునైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, మల్టీకలర్ బీడ్స్ కూడా దొరుకుతున్నాయి)