విమానాలు విశేషాలు
పురాణాల్లోని పుష్పక విమానం గురించిన కథలు చాలా శతాబ్దాలుగానే ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దం కిందటి వరకు ఆ కథలు విన్న వాళ్లెవరూ ఆకాశంలో నిజంగా ఎగిరే విమానాన్ని చూసి ఎరుగరు. అమెరికాకు చెందిన రైట్ సోదరులు 1905 నాటికి పూర్తిస్థాయిలో మనుషుల రవాణాకు పనికొచ్చే తొలి విమానానికి రూపకల్పన చేసి, విజయవంతంగా దాన్ని ఆకాశంలో నడిపించగలిగారు. అప్పట్లో వారు తయారు చేసిన విమానం చాలా నెమ్మదిగా ఎగిరేది. ఇప్పుడైతే విమానాలు ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించగలుగుతున్నాయి గానీ, రైట్ బ్రదర్స్ రూపొందించిన విమానం గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లు మాత్రమే.
రైట్ బ్రదర్స్ విమానం కనుగొన్న పదేళ్లకు గానీ విమానయానం ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. అమెరికాకు చెందిన ఎలియట్ ఎయిర్ సర్వీస్ 1915లో మొట్టమొదటిసారిగా పౌర విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమానయానం దేశ దేశాలకు పాకడంతో 1944లో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ఏర్పడింది. ఐసీఏఓకు 1994లో యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 7వ తేదీని అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే) ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం సందర్భంగా విమానయానం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు...
మన దేశంలో జేఆర్డీ టాటా ఆద్యుడు
మనదేశంలో పౌర విమానయానానికి జేఆర్డీ టాటా ఆద్యుడు. పారిశ్రామికవేత్త అయినప్పటికీ స్వయంగా పైలట్ అయిన టాటా దృష్టి విమానయానంపైనే ఉండేది. ఆయన 1932లో ప్రారంభించిన టాటా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల రవాణాతో పాటు తపాలా బట్వాడా సేవలనూ అందించేది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే టాటా ఎయిర్‌లైన్స్ విమానాలు 1.60 లక్షల మైళ్లు ప్రయాణించాయి. 155 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాయి. 10 టన్నుల తపాలాను బట్వాడా చేశాయి. టాటా ఎయిర్‌లైన్స్ తొలినాళ్లలో తన విమానాలను భారత భూభాగం పరిధిలోనే నడిపేది. విమానయాన సేవలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ‘ఎయిర్ ఇండియా’గా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలోని 49 శాతం పెట్టుబడులను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత జేఆర్డీ టాటా సలహాపై భారత ప్రభుత్వం డొమెస్టిక్ విమానాలు నడిపేందుకు ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’ ప్రారంభించింది. అప్పటి నుంచి ‘ఎయిర్ ఇండియా’ పూర్తిగా అంతర్జాతీయ విమానయాన సేవలు ప్రారంభించింది.
విమానయానంలో వేగమే వేదం
విమానయానానికి వేగమే వేదంగా మారింది మాత్రం జెట్ విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే. తొలిసారిగా 1964లో ‘లియర్‌జెట్’ విమానాలు ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి గరిష్ట వేగం గంటకు 900 కిలోమీటర్లకు పైనే. ‘లియర్‌జెట్’ విమానాలు అందుబాటులోకి వచ్చిన దశాబ్దం గడవక ముందే బోయింగ్ విమానాలు మరింత వేగంతో రంగంలోకి దిగాయి. వీటి గరిష్ట వేగం గంటకు దాదాపు 990 కిలోమీటర్లు. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత దూరాల భారం గణనీయంగా తగ్గి ప్రయాణాలు సులభతరమయ్యాయి.